లాక్‌డౌన్ టెన్షన్.. హైదరాబాద్‌కు బై బై!
posted on Apr 22, 2021 @ 1:27PM
ఇప్పటికే నైట్ కర్ఫ్యూ. ప్రతీ రోజూ 4వేలకు పైగా కేసులు. ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేవంటూ ప్రచారం. ఆక్సిజన్ సరఫరా అంతంత మాత్రమేనంటూ పుకార్లు. డబుల్ కాదు.. ఏకంగా త్రిబుల్ మ్యూటేషన్ అంటూ వార్తలు. దేశంలో ఇప్పటికే అనేక నగరాల్లో వీకెండ్ లాక్‌డౌన్. త్వరలోనే తెలంగాణలోనూ లాక్‌డౌన్ తప్పదంటూ అంచనాలు. ఇలా వరుస భయాలతో వలస జీవులంతా హైదరాబాద్‌ను విడిచిపెడుతున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్‌కే కరోనా సోకగా.. ఇక తమలాంటి వారి పరిస్థితి ఏంటంటూ.. బతుకు జీవుడా అనుకుంటూ.. వలస వెళుతున్నారు. దీంతో.. హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన వారంతా తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. పలు కంపెనీల్లో పని చేసే వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు పయనమవుతున్నారు. గతంలో మాదిరి సడెన్ లాక్‌డౌన్ పెడితే.. తాము ఇక్కడే చిక్కుకుపోతామని భయపడుతున్నారు. అందుకే పరిస్థితులు అదుపు తప్పకముందే సొంతింటికి చేరుకుంటే బెటర్ అనుకుంటూ తిరుగు ప్రయాణం కడుతున్నారు.
కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వలస కార్మికులు దాదాపు 18 లక్షల మందికి పైనే ఉంటారు. వీరిలో దాదాపు 60 శాతం మంది వారం క్రితమే నగరాన్ని విడిచిపెట్టారని తెలుస్తోంది. మిగిలిన వారు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.
పెద్ద ఎత్తున తరలిపోతున్న వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లు నిండిపోతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్ నాలుగైదు రోజుల ముందే పూర్తయిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజుకు సగటున 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, స్వగ్రామాలకు జనం తరలుతుండడంతో నగరంలోని రోడ్లు చాలా వరకు ఖాళీగా ఉంటూ.. ట్రాఫిక్ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రజల్లో కరోనా భయం మామూలుగా లేదు మరి.