ఎంపీ సంతోష్ కు కరోనా! సీఎంతో కలిసి ఫాంహౌజ్ లో క్వారంటైన్
posted on Apr 22, 2021 @ 3:01PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉండే రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీనాయకులు తనకు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు ఎంపీ సంతోష్ కుమార్.
రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సంతోష్ కుమార్.. సీఎం కేసీఆర్ కు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటారు. కేసీఆర్ ఎక్కడికెళ్లినా ఆయన వెంట సంతోష్ ఉంటారు. నాలుగు రోజుల క్రితమే కేసీఆర్ కు కరోనా సోకింది. ఈనెల 14న నాగార్జున సాగర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఆ సభలోనే కేసీఆర్ కు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. సాగర్ సభకు కేసీఆర్ తో పాటు ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. దీంతో ఎంపీకి కూడా సాగర్ సభలోనే కరోనా సోకవచ్చని భావిస్తున్నారు.
కరోనా సోకడంతో తన ఫాంహౌజ్ లోనే క్వారంటైన్ లో ఉన్నారు కేసీఆర్. బుధవారం సాయంత్రం యశోద హాస్పిటల్ కు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్ తో పాటు సంతోష్ కూడా యశోద హాస్పిటల్ కు వచ్చారు. కేసీఆర్ తో పాటు ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారని, అందులో కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని తెలుస్తోంది.