ఒకే దేశంలో రెండు ధరలా! కేంద్రంపై కేటీఆర్ ఫైర్
posted on Apr 22, 2021 @ 10:01AM
ఒకే దేశం.. ఒకే పన్ను .. ఇది కేంద్ర సర్కార్ విధానం. దేశ వ్యాప్తంగా జీఎస్టీ రేట్లను ఒకేలా అమలు చేస్తోంది మోడీ సర్కార్. కాని కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో మాత్రం తేడా చూపిస్తోంది. మే 1నుంచి 18 ఏండ్లు నిండన ప్రతి ఒక్కరికి టీకా వేయాలని నిర్ణయించింది కేంద్రం. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేంద్రంతో రాష్ట్రాలకు టీకాలు పంపిస్తుండగా.. ఇకపై రాష్ట్రాలు నేరుగా ఫార్మా కంపెనీల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు పంపిణి చేస్తున్నారు.
కేంద్ర సర్కార్ నిర్ణయంతో రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ సంస్థలకు టీకాలు విక్రయించేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధవుతున్నాయి. కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరమ్ రేట్లను కూడా ప్రకటించింది. అయితే కేంద్రానికి ఒక్క డోసును 150 రూపాయలకు అందిస్తున్న సీరమ్.. రాష్ట్రాలకు మాత్రం ఒక్క డోసు ధర 4 వందల రూపాయలుగా ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు 6 వందలకు ఒక్క డోసు విక్రయిస్తామని తెలిపింది. ఇప్పుడు ఇదే వివాదాస్పదమవుతోంది. కేంద్రానికి 150 రూపాయలకు ఇస్తూ.. రాష్ట్రాలకు 4 వందల రూపాయలకు పెంచడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
కొవిడ్ వ్యాక్సిన్ ధరలకు సంబంధించి కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఒకే దేశం- ఒకే పన్ను సిస్టమ్ అమలులో ఉండగా.. వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకని ఆయన ట్వీట్ చేశారు. కేంద్రానికి 150 రూపాయలకే ఇస్తూ.. రాష్ట్రాలకు ధర పెంచడం ఏంటని కేటీఆర్ నిలదీశారు. పీఎం కేర్ ఫండ్స్ డబ్బులు ఉపయోగించి వ్యాక్సిన్ ఉత్పత్తిని ఎందుకు పెంచలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకే దేశం – ఒకే పన్ను కోసం జీఎస్‌టీని అంగీకరించామని, కానీ, ఇప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు చూస్తున్నామని విమర్శించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి భరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తికి కేంద్రం ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.