ప్రాణాలు పోతుంటే ఎన్నికలా? కేసీఆర్ కు మాయని మచ్చేనా?
posted on Apr 22, 2021 9:23AM
కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. వైరస్ వేగంగా విస్తరిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కరోనా విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. సరైన చికిత్స అందక నరకయాతన పడుతున్నారు. ఆక్సిజన్ సకాలంలో అందక పిట్టల్లా రాలిపోతున్నారు. తమ కండ్ల ముందే రోగులు చనిపోతున్నా వైద్యులు ఏమి చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు.
కరోనాతో పరిస్థితులు దారుణంగా ఉన్నా పాలకుల తీరు మాత్రం మారడం లేదు. తమకు ప్రజల ప్రాణాల కంటే ఓట్లు, సీట్లే ముఖ్యమన్నట్లుగా ప్రవరిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి చేయిదాటి పోయే పరిస్థితుల్లో ఉన్నా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఏప్రిల్ 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నిక జరగనుంది. కరోనా కల్లోల సమయంలో ఎన్నికలు వద్దని విపక్షాలు మెత్తుకుంటున్నా పట్టించుకోలేదు. కేసీఆర్ సర్కార్ ఆదేశాలతో హడావుడిగా షెడ్యూల్ ఇచ్చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియను చేపట్టింది. దీంతో కేసీఆర్ సర్కార్ తీరుపై జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏండ్ల కొద్ది ప్రత్యేక అధికారుల పాలన సాగిన సందర్బాలు ఉన్నాయని చెబుతూ.. జనాల భధ్రతపై కనీసం ఆలోచన లేకుండా పట్టుబట్టి మరీ ఎన్నికలు జరపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. అన్ని పార్టీలు తమ బలగాలను అక్కడ మోహరించాయి. కరోనాను పట్టించుకోకుండానే అంతా ప్రచారం చేశారు. మాస్కులు లేవు... భౌతిక దూరం అసలే లేదు. దీంతో నాగార్జున సాగర్ ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. సాగర్ ప్రచారంలో పాల్గొన్న నేతలందరికి వైరస్ సోకింది. హాలియా బహిరంగసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నియోజకవర్గంలో గత నాలుగు రోజుల్లోనే దాదాపు వెయ్యి మందికి కరోనా నిర్దారణ అయిందంటే పరిస్థితి ఎంత డేంజర్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాగార్జున సాగర్ పరిస్థితి కళ్ల ముందు ప్రత్యక్షంగా కనబడుతున్నా... మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం ముందుకెళ్లడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిజానికి నాగార్జున సాగర్ ఎన్నికల సమయం కంటే ప్రస్తుతం కరోనా మరింతగా విజృంభిస్తోంది. గాలిలో కూడా వైరస్ వ్యాపిస్తుందనే పరిశోధనలు చెబుతున్నారు. ఎక్కడ పరీక్షలు చేసినా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయినా ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లడంపై వైద్య రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనాలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికే కరోనా సోకిందని.. ఇక జనాల్లో తిరిగే స్థానిక నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఐదు వందల రూపాయలు, మద్యం బాటిల్ ఇచ్చి ఎన్నికలకు సభలకు రప్పిస్తూ.. వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారని మండిపడుతున్నారు.
మరోవైపు ఎన్నికలు జరగుతున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల ,అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీ లీడర్లు సైతం కరోనాతో భయపడిపోతున్నారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలని ఆందోళన చెందుతున్నారు. జనమంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి సమయంలో ఎలా ప్రచారం చేస్తామని చెబుతున్నారు. అయితే స్థానిక నేతల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలకు ప్రచారం చేసుకునే సమయం లేకుండా ఎన్నికలు నిర్వహించి.. తమ ఖాతాలో వేసుకోవాలని కేసీఆర్ వ్యూహమని చెబుతున్నారు. అధికారం కోసం ఆయన వ్యూహం ఎలా ఉన్నా.. ప్రజల్లో మాత్రం కేసీఆర్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కేసీఆర్ కు కూడా కరోనా సోకినందున... ఆయన ఇప్పటికైనా పరిస్థితి గమనించి ఎన్నికలను వాయిదా వేస్తే బెటరని సూచిస్తున్నారు. లేదంటే కేసీఆర్ రాజకీయ జీవితంలో ఈ ఎన్నికలు మాయని మచ్చలా మిగిలిపోతాయని చెబుతున్నారు.