పరీక్షల పంతం.. ప్రభుత్వం మొండిఘటం!
posted on Apr 22, 2021 @ 5:20PM
సర్కారు మరీ మొండికేస్తోంది. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పంతానికి పోతోంది. ఓవైపు ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. పరీక్షల రద్దుపై నిర్ణయానికి వెనకాడుతోంది. పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ సబ్ కమిటీ సమావేశమైనా.. ఎగ్జామ్స్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
మరోసారి సమీక్ష తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రి సురేశ్ ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అంతకుముందు, ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరై కరోనా బారిన పడితే.. సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది. విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతోంది. దేశంలో అనేక ప్రభుత్వాలు పరీక్షలు వాయిదా వేస్తున్నా.. జగన్‌రెడ్డి సర్కారు నిర్ణయంలో మాత్రం మార్పు రావడం లేదని నిలదీశారు. ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే 80శాతం విద్యార్థులు కొవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని సర్కారును హెచ్చరించారు నారా లోకేశ్.