మీవల్లే కరోనా కల్లోలం.. వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలి..
posted on Apr 22, 2021 @ 4:02PM
దేశ పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇదీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్. వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అనుసరిస్తున్న విధానం వివక్షాపూరితంగా, పక్షపాతంతో కూడుకుందని ఆరోపించారు. 18ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్ అందివ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.
‘కరోనా వైరస్ మహమ్మారి గత ఏడాది నుంచి పౌరులకు కఠినమైన బాధలను కలిగిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష, పక్షపాత విధానాలను అనుసరిస్తూనే ఉంది. ఇలాంటి నిర్ణయాలు ఇప్పటికే ఉన్న సవాళ్లను మరింత పెంచుతాయి’ అని వ్యాక్సిన్ విధానంపై ప్రధానికి రాసిన లేఖలో సోనియాగాంధీ తప్పుబట్టారు. దేశ యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను మరచినట్లు స్పష్టంగా తెస్తుందని నిలదీశారు.
మూడో విడత వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా.. తయారీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి 50శాతం కరోనా టీకా డోసులు అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటుకు మరో 50శాతం డోసులను సరఫరా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. దీంతో కొవిషీల్డ్ టీకాను కేంద్ర ప్రభుత్వానికి డోసుకు రూ.150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400, ప్రైవేటుకు రూ.600గా ధరను నిర్ణయిస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ఇలా భిన్న ధరలను నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌కు మూడు రకాల ధరను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. సామాన్య పౌరులు టీకాల కోసం భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకూ తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని అభిప్రాయపడింది. దీనిపై ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకొని వ్యాక్సిన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అటు, రాహుల్ గాంధీ సైతం ప్రసంగాలు కాదు, పరిష్కారాలు చూపాలంటూ మోదీని నిలదీశారు.
ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఒకే దేశంలో, ఒకే వ్యాక్సిన్‌కు వేరు వేరు ధరలు ఉండటంపై కేంద్రాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు. ఇలా వ్యాక్సిన్ విధానంపై సర్వత్రా విమర్శలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మూడో విడత వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ నెల 28 నుంచి 18 ఏళ్ల పైబడిన వారుకి వ్యాక్సిన్ రిజిష్ట్రేషన్లను ప్రారంభించింది కేంద్రం.