టెస్టుల ఫియర్.. 300మంది పరార్..
posted on Apr 22, 2021 @ 4:51PM
కరోనా అంటే భయం. కరోనా టెస్టులన్నా భయం. ఎక్కడ పాజిటివ్ వస్తుందో.. ఎక్కడ క్వారంటైన్‌లో ఉండాలోననే టెన్షన్. అదే భయం వారిని అక్కడి నుంచి పారిపోయేలా చేసింది. కరోనాతో దాగుడు మూతలు ఆడుతూ.. దేశంలో వైరస్ వర్రీ పెంచేస్తున్నారు ఇలాంటి వాళ్లు.
తమ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే కొవిడ్ టెస్టులు తప్పనిసరి చేశాయి కొన్ని రాష్ట్రాలు. అందుకే, వివిధ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లే వారు అక్కడి పరీక్షలకు మస్కా కొడుతున్నారు. అధికారులకు చిక్కకుండా చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవల బిహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో కరోనా పరీక్షలు చేయించుకోకుండా కొందరు ప్రయాణికులు పరుగులు తీసి కాసేపు కల్లోలం రేపారు. లేటెస్ట్‌గా అస్సోంలోని ఓ ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. టెస్టులు వద్దంటూ.. ఏకంగా 300 మంది ప్యాసింజర్లు విమానాశ్రయం నుంచి పారిపోయారు.
కరోనా కట్టడిలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కరోనా టెస్టులను తప్పనిసరి చేసింది అస్సాం ప్రభుత్వం. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి పరీక్షలు చేస్తోంది.సిల్చార్ ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టుల నిమిత్తం వైద్య సిబ్బంది ప్రయాణికులను ఆపగా.. కొందరు వారితో వాగ్వాదానికి దిగారు. పరీక్షలకు ధర రూ. 500 ఉండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గందరగోళంలోనే ప్యాసింజర్లు అక్కడి నుంచి పారిపోయారు.
ఆ విమానాశ్రాయానికి 6 విమానాల్లో 690 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో 300 మందికి పైగా పరీక్షలు చేయించుకోకుండా ఎస్కేప్ అయ్యారు. మిగతా వారికి కపరీక్షలు జరపగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పరారీ అయిన ప్రయాణికుల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రయాణికులు అందరి వివరాలు తమ దగ్గర ఉన్నాయని, వారిని ట్రేస్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ అస్సోం ప్రభుత్వం తాజాగా నిబంధనలు మరింత కఠినం చేసింది.