500 మంది డాక్టర్లకు కరోనా.. డేంజర్ బెల్స్..
posted on Apr 22, 2021 @ 12:56PM
కొవిడ్‌పై వైద్య సిబ్బంది వీరోచితంగా పోరాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రోగులకు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ల అవస్థ చూసి కన్నీరు పెడుతూ, బాధ పడుతూ ఓర్పుగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది డాక్టర్లు వైరస్ కాటుకు గురవుతున్నా వెనకడుగు వేయట్లేదు. తాజాగా బిహార్‌లోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడటం కలకలం రేపుతోంది.
కరోనా సెకండ్ వేవ్‌లో బిహార్‌లోని ఎయిమ్స్, పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 500 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిమ్స్‌లో మొత్తం 384 మంది సిబ్బందికి వైరస్ సోకగా.. ఇందులో అత్యధికంగా డాక్టర్లు, నర్సులు ఉన్నారు. పట్నా మెడికల్ కాలేజీలో 70 మంది వైద్యులు సహా 125 మంది ఆరోగ్య సిబ్బందికి కొవిడ్ సోకింది.
బిహార్ రాజధానిలో ఎయిమ్స్, పట్నా మెడికల్ కాలేజీతో పాటు నలంద మెడికల్ కాలేజీలో అత్యధికంగా కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ ఆసుపత్రుల్లోని సిబ్బందికి కూడా ముప్పు పెరిగిందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆయా ఆసుపత్రుల్లో సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచారు. అయితే డాక్టర్లు అధిక సంఖ్యలో కరోనా బారినపడటంతో అక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఆసుపత్రుల్లో మిగతా వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు అందిస్తామని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది.