కరోనా కల్లోలంలో కక్షరాజకీయాలా! ఏపీలో అరాచక పాలన?
posted on Apr 23, 2021 8:44AM
దేశమంతా కరోనాతో వణికిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. గురువారం ఏపీలో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో తమ ప్రాణాలు కాపాడుకోవటానికి జనాలు కష్టాలు పడుతున్నారు. ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. కరోనా కల్లోల పరిస్థతుల్లోనూ జగన్ రెడ్డి సర్కార్ మాత్రం కక్ష రాజకీయాలకు దిగింది. టీడీపీ నేతలను వరుసబెట్టి అరెస్టులు చేస్తోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసింది. తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు నరేంద్ర ఇంటిని చుట్టుముట్టి... అతన్ని తీసుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో వందలాది మంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ సర్కార్ తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయి. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని సూచించారు. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి అని నారా లోకేష్ మండిపడ్డారు. ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం.. మీలాంటి దోపిడీ కుటుంబం కాదు జగన్ రెడ్డి అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సంఘం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచింది ధూళిపాళ్ల కుటుంబమని చెప్పారు. ప్రభుత్వ అసమర్ధతను,దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై జగన్ రెడ్డి కక్ష కట్టారని లోకేష్ ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఒక డ్రామా ని స్ట్రింగ్ ఆపరేషన్ తో బట్టబయలు చేసి జగన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలని ధ్వజమెత్తారు. చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదన్నారు నారా లోకేష్.
కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతలపై వేధింపులకు దిగుతూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారనే అక్కసుతోనే ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్ల నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందనిఅచ్చెన్నాయుడు ఆరోపించారు. ధూళిపాళ్ల ఏం తప్పు చేశారని ఆయన ఇంటికి 100 మంది పోలీసులను పంపారు? ఆయనేమైనా తీవ్రవాదా లేక ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. గుజరాత్ కు చెందిన అమూల్ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు
అచ్చెన్నాయుడు.