వ్యాక్సిన్ దొంగ.. టీకా రిటర్న్స్.. ఎలాగంటే...
posted on Apr 23, 2021 @ 11:32AM
ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం. 1,700 వ్యాక్సిన్లు మాయం. ఓ దొంగ వాటిని ఎత్తుకెళ్లాడు. సిబ్బంది హడావుడి పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్ దొంగ కోసం గాలిస్తున్నారు. అసలే దేశంలో వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. ఇలాంటి సమయంలో ఏకంగా 17వందల టీకాలను ఎత్తుకెళ్లడం అంటే చిన్న విషయమేమీ కాదు. అందుకే పోలీసులు ఆ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటన హరియాణాలోని జింద్ జిల్లా కేంద్రంలో జరిగింది.
కట్ చేస్తే.. వ్యాక్సిన్లు తిరిగొచ్చాయి. పోలీసులేమీ దొంగను పట్టుకొని టీకాలను స్వాధీనం చేసుకోలేదు. పాపం.. ఆ దొంగ.. మంచి దొంగలా ఉన్నాడు. తాను వాటిని కరోనా వ్యాక్సిన్లు అనుకోలేదని.. పొరబాటు జరిగిందంటూ టీకాలను తిరిగిచ్చేశాడు. నేరుగా పోలీసుల చేతికి ఇస్తే తనను పట్టుకుంటారని తెలిసిన ఆ దొంగ.. తెలివిగా ఆ టీకాల బాక్స్‌ను పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో ఇచ్చాడు. తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని.. తనకు వేరే పని ఉండటంతో ఈ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ టీ షాప్ అతను ఆ బాక్స్‌ను పోలీసులకు ఇచ్చాడు. ఖాకీలు పెట్టెను తెరవగా వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది. హిందీలో ఉన్న ఆ ఉత్తరంలో.. ‘‘ క్షమించండి. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు’’ అని రాశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కొరత ఉన్న కరోనా చికిత్సలో వాడే రెమిడెసివిర్ ఇంజెక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.