పది, ఇంటర్ పరీక్షలు రద్దు? దిగొస్తున్న ఏపీ సర్కార్
posted on Apr 22, 2021 @ 10:06PM
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి , ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు కానున్నాయా? విపక్షాల డిమాండ్ కు జగన్ సర్కార్ తలొగ్గిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరు విద్యార్థులకు పై తరగతులకు ప్రమోట్ చేసిన ఏపీ సర్కార్.. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసింది. జేఈఈ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు కాగా.. సెకండియర్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయినా జగన్ సర్కార్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడమే కాదు షెడ్యూల్ కూడా ఇచ్చింది.
జగన్ రెడ్డి సర్కార్ పై తీరుపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డాయి. కరోనా భయానికి దేశమంతా పరీక్షలు రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగితే.. జగన్ రెడ్డి మాత్రం పంతానికి పోయి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలు జనాల నుంచి కూడా వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లు పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ అయితే కొన్ని రోజులుగా ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కోర్టుకు వెళ్లడానికి న్యాయవాదులతో చర్చలు కూడా జరిపారు.
పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తారా? అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తాజాగా ప్రశ్నించారు. లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని కూడా రాజకీయం చేసే రీతిలో లోకేశ్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. నారా లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎక్కడో హైదరాబాదులో ఉంటున్న లోకేశ్... ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
పరీక్షల నిర్వహణపై మరో సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి తాజా ప్రకటనతో పరీక్షల రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తోంది. తెలంగాణ తరహాలోనే పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసి.. సెకండియర్ పరీక్షను వాయిదా వేయనున్నారని సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. దీంతో పరీక్షలు రద్దు కావడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు పక్కాగా చెబుతున్నాయి.