సీఎంపై సొంత పార్టీ ఎంపీ పోరాటం.. దేశంలోనే ఏపీ స్పెషల్
posted on Apr 22, 2021 @ 10:06PM
దేశంలో అన్ని రాష్ట్రాలు వేరు.. ఆంధ్రప్రదేశ్ వేరు అన్నట్లుగా ఉంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో అంతా స్పెషలే. మూడు రాజధానులు.. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. ఇలా అన్ని రాష్ట్రాలకు భిన్నం. పాలనలో అంతా రివర్స్ పాలనే అనే ఆరోపణలు ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో తీసుకున్న నిర్ణయాలతో ఏపీకి పెట్టుబడిదారులు రావాలంటే జంకే పరిస్థితి ఉందంటున్నారు. గతంలో మొదలైన ప్రాజెక్టులు చాలా వరకు జగన్ రెడ్డి దెబ్బకు మూత పడ్డాయి. పాలనలోనే కాదు రాజకీయంగానే ఏపీలో అంతా స్పెషలే. ఎంతగా అంటే.. సొంత పార్టీ ఎంపీనే ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసేంత.
నర్సాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు... వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కోసం పోరాటం చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణ ధాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్‌లను సీబీఐ నమోదు చేసిందని పిటీషనర్ వాదనలు వినిపించారు. పిటీషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారాయణ రావువాదనలు వినిపించారు. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు కొనసాగాయి. పిటీషన్‌ను విచారించాలా లేదా అన్నదానిపై ఈ నెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం తెలుపనుంది. సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం ఆయన పార్టీకి చెందిన ఎంపీనే పిటిషన్ వేయడంపై దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
రఘురామ వైసీపీ ఎంపీగా గెలిచినా.. కొన్ని రోజులకే ఆ పార్టీకి రెబెల్ గా మారారు. గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలను మాత్రం చీల్చి చెండాడుతున్నారు. ఢిల్లీలో రోజూ రచ్చబండ పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. జగన్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మూడు రాజధానులు, రివర్స్ టెండరింగ్. ఇసుక, మద్యం పాలసీ, మైనింగ్, వాలంటీర్ వ్యవస్థ ఇలా ఏ అంశాన్ని వదలిపెట్టకుండా వైసీపీ సర్కార్ కు పక్కెంలో బల్లెంలా మారిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గత ఎస్ఈసీ నిమ్మగడ్డ, జగన్ సర్కార్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో నిమ్మగడ్డకు మద్దతుగా నిలిచారు రఘురామ.
చాలా కాలంగా తమను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నా రఘురామపై యాక్షన్ తీసుకోలేకపోయింది వైసీపీ అధిష్టానం. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నా సస్పెండ్ చేయలేకపోయింది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నా అలా ఎందుకు వదిలేస్తున్నారన్నది ప్రశ్నగా మిగిలింది. జగన్ ను రఘురామ టార్గెట్ చేయడానికి కారణం ఉందంటున్నారు. ఎంపీగా ఆయనకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. వైసీపీకి రెబెల్ గా మారారు కాబట్టి.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రఘురామ కోరుకుంటున్నారు. అలా అయితేనే ఆయన పదవికి గండం ఉండదు. అందుకే సీఎం జగన్ సహా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. అయితే రఘురామ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్న వైసీపీ.. ఆయనకు కౌంటర్ గా ఎత్తులు వేస్తోంది. అతను ఎంతగా విమర్శించినా సస్పెండ్ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో సొంత పార్టీ నుంచే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూ జనాల్లో వైసీపీ చులకన అవుతుందనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది.
రఘురామను సస్పెండ్ చేస్తే వైసీపీకి ఒక ఎంపీ సీటు తగ్గడం తప్ప పెద్దగా నష్టం ఉండదు. కాని ఆ పని చేయలేకపోతోంది. అదే సమయంలో వైసీపీ ఎంపీగానే ఆయన వైసీపీ సర్కార్ పై విమర్శలు చేయడం మాత్రం ఆ పార్టీకి నష్టం కల్గిస్తుందని చెబుతున్నారు. ఒక ఎంపీపై అనర్హత వేటు వేయించడం కోసం .. పార్టీకి నష్టం కలుగుతున్నా వేచిచూడటం మంచిది కాదనే చర్చ వైసీపీ నేతల్లోనూ జరుగుతుందని తెలుస్తోంది. కాని వైసీపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న జగన్ కాబట్టే.. ఎవరూ ఏమి చేయడానికి వీల్లేదు.. జగన్మోహనుడి ఎలా చెబితే అలా నడుచుకోవడమే...