ఎవరెస్ట్ ఎక్కిన కరోనా వైరస్.. పర్వతారోహకుల్లో కలకలం..
posted on Apr 23, 2021 @ 12:10PM
ఎక్కడ చూసినా కరోనా. ఏ ప్రాంతం వెళ్లినా కరోనా. అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా.. ఎక్కడపడితే అక్కడ కరోనా కేసులు. యావత్ దేశం కొవిడ్ మహమ్మారితో అల్లాడిపోతోంది. లేటెస్ట్‌గా.. ఎవరెస్ట్ శిఖరం ఎక్కే బేస్ క్యాంప్‌లోనూ కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. వైరస్ వ్యాప్తికి నిదర్శనంగా మారుతోంది.
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో కనుగొన్నారు. అతడిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, `కుంభ్`దగ్గు, `ఆల్టిట్యూడ్ సిక్‌నెస్`, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయినా, ఎందుకైనా మంచిదని.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఖాట్మాండు హాస్పిటల్‌లో టెస్ట్ చేయగా అతనికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బేస్ క్యాంప్‌లో మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం కోసం పర్వాతారోహకుల ప్రాణాలతో నేపాల్ ప్రభుత్వం ఆటలాడుతోందని పలు అంతర్జాతీయ పత్రికలు విమర్శలు గుప్పిస్తున్నాయి.