న్యాయవాదులకు నో ఎంట్రీ.. ధూళిపాళ్లను విచారిస్తున్న ఏసీబీ..
posted on Apr 23, 2021 @ 11:54AM
తెల్లవారుజామున వంద మందికి పైగా పోలీసులు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇంటిపై దాడి చేశారు. అక్కడికక్కడ ఆయన్ను అరెస్ట్ చేశారు. గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించి నరేంద్రను విచారిస్తున్నారు. ధూళిపాళ్లను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులను.. లోనికి అనుమతించేందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు. నరేంద్రను విచారిస్తున్నామని.. విచారణ పూర్తి అయిన తరువాతే కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణని, కార్యదర్శి గురునాధాన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. సంగం డెయిరీలో అవకతవకలు జగిగాయంటూ నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీసులో ఏసీబీ తెలిపింది. సంగం డెయిరీకి చైర్మన్‌గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం కక్ష్య సాధింపు చర్య అంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. సంగం డెయిరీని అమూల్ మిల్క్‌కు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నరేంద్రను అరెస్ట్ చేశారంటూ విమర్శించారు.