సంగం వర్సెస్ అమూల్.. జగన్‌రెడ్డి స్కెచ్ ఏంటి?
posted on Apr 24, 2021 @ 5:23PM
సంగం డెయిరీ వర్సెస్ అమూల్. హెరిటేజ్ మిల్క్ వర్సెస్ అమూల్ మిల్క్. విజయ పాలు వర్సెస్ అమూల్ పాలు. ఒంగోలు మిల్క్, విశాఖ పాలు, తిరుమల పాలు.. ఇలా ఏపీలోని పాల కంపెనీలన్నిటికీ అమూల్ పాలు ప్రధాన పోటీ దారుగా మారింది. అమూల్ పాలు తాగుతోంది ఇండియా.. అంటూ ఇన్నాళ్లూ టీవీల్లో మాత్రమే యాడ్స్ చూశాం. ఇప్పుడు ఏపీ ప్రజలచే బలవంతంగా అమూల్ మిల్క్ తాగించే ప్రయత్నం, కుతంత్రం జరుగుతోందనేది ఆరోపణ. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రైతులకు కొంగు బంగారంగా ఉన్న పాడి సంస్థలను ఏకమొత్తంగా కబలించే కుట్ర చేస్తున్నారని అనుమానం. ఇందులో ప్రభుత్వమే ప్రధాన పాత్రధారి, సూత్రధారి కావడం మరింత ప్రమాదకరం అంటున్నారు.
సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌తో ఏపీలో కలకలం. అమూల్ మిల్క్ కోసమే ఈ అరెస్ట్ అంటూ ప్రతిపక్షం విమర్శలు. దీంతో.. అసలు ఏంటీ అమూల్ మిల్క్? గుజరాత్ నుంచి ఏపీకి ఎందుకొచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? వ్యాపారం కోసమేనా? మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు అందరిలోనూ..
అమూల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది ఏపీలోని పలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో అమూల్ పాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ''ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పాల సేకరణ, రైతులకు చెల్లింపులు జరుగుతాయి. కేవలం మార్కెటింగ్ కోసమే అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. పశు పోషణకు అవసరమైన అన్ని రకాల సహాయం నేరుగా ప్రభుత్వమే అందిస్తుంది. రైతులకు చెల్లింపులు కూడా ప్రభుత్వం ద్వారా జరుగుతాయి. కాబట్టి రైతులకు ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది" అనేది ప్రభుత్వం చెబుతున్న మాట.
పాల సేకరణ కేంద్రాల దగ్గర ఫ్యాట్ ఆధారంగా లీటర్ పాల ధరను నిర్ణయిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ డెయిరీలైన హెరిటేజ్, తిరుమల, సంగం, విశాఖ, కృష్ణా, ఒంగోలు మిల్క్ డెయిరీల ఆధ్వర్యంలో ఒక్కొక్కరు ఒక్కో ధర చెల్లిస్తున్నారు. కొన్ని డెయిరీలు 10 శాతం ఫ్యాట్ ఉండే లీటర్ పాలకు 65 రూపాయలు చెల్లిస్తుండగా.. చాలా సంస్థలు మాత్రం రైతులకు లీటరుకు 60 లోపే ధర ఇస్తున్నారు. అమూల్ వచ్చాక వాటి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం అమూల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలలో సేకరిస్తున్న పాల కేంద్రాలలో వాటి ధర అత్యధికంగా రూ. 71 వరకూ ఉంది. అమూల్ రాకతో మిగతా సంస్థలు పాల సేకరణ ధరను పెంచాయి. రైతులు పాలు ఎవరికి పోస్తారన్నది వారి సొంత నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. చేయూత లబ్దిదారులు మాత్రం అమూల్ కేంద్రాలకే పాలు పోయాల్సి ఉంటుంది.
అమూల్ సంస్థకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వమే నిర్వహించకుండా అమూల్ వంటి సంస్థలకు పెత్తనం అప్పగించిన తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా లేనిది.. జగన్‌రెడ్డి సీఎం అవగానే అమూల్ సంస్థ ఏపీలో ఎంట్రీ ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతోంది. ప్రధానంగా హెరిటేజ్ మిల్క్, సంగం డెయిరీలను దెబ్బ కొట్టేందుకే అమూల్‌ను ఏపీకి తీసుకొచ్చారని అంటున్నారు. ప్రభుత్వ ప్రయోజనాలు అందవంటూ పాడి రైతులను బెదిరించి.. వారిని అమూల్ వైపు డైవర్ట్ చేస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. అమూల్ కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టే బదులు.. ఆ నిధులేవో డెయిరీ సంస్థలకు, పాడి పరిశ్రమ సంఘాలకు కేటాయిస్తే అవే డెవలప్ అవుతాయిగా అని ప్రశ్నిస్తున్నారు.
అమూల్ వెనుక.. తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టే పొలిటికల్ వ్యూహం దాగుందని విమర్శిస్తున్నారు. గతంలో సంగం డెయిరీకి పాలు పోసిన రైతులు.. అమూల్ వచ్చిన తర్వాత అటు వైపు మళ్లారు. అక్కడ డబ్బులు రావడం ఆలస్యం కావడం.. అంతలోనే సంగం డెయిరీ సైతం పాల సేకరణ ధర పెంచడంతో.. ఆ రైతులు మళ్లీ అమూల్ నుంచి సంగం డెయిరీకి షిఫ్ట్ అయ్యారు. ఇలా పలు జిల్లాల్లోని పాడి రైతులు అమూల్ నుంచి స్థానిక పాల సహకార సంఘాల వైపు తిరిగి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.
సంగం డెయిరీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ఆ సంస్థపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. సంగం డెయిరీలో తక్కువ వెన్న శాతం ఉన్న ఆవుపాలను 70 శాతంపైగా సేకరించి వాటికి అధిక వెన్న శాతం ఉన్న గేదే పాలను చేర్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారనేది పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య ఆరోపణ. అలాగే రైతులకు బోనస్ పేరుతో క్యారేజీలు, హాట్ బాక్స్‌లు పంచుతున్నారని.. బోనస్ అంటే ఇదేనా అని గతంలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రశ్నించారు. బినామీ పేర్లతో ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర డబ్బులు దోచుకుంటున్నారని విమర్శించారు.
అయితే, వైసీపీ విమర్శలను ఎప్పటికప్పుడు ఖండించే వారు సంగం డైయిరీ ఛైర్మన్‌గా ఉన్న టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. బినామీ పేర్లతో రైతులున్నట్లు ప్రభుత్వం నిరూపించాలని సవాల్ చేశారు. ఆవు పాలను సేకరించి అధిక ధరకు అమ్ముతున్నారని ఆరోపణలు చేయడంపై ఆధారాలు చూపాలని అప్పట్లో ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. అమూల్ అత్యధికంగా ఆవు పాలనే సేకరించి విక్రయిస్తుందన్నారు.
మరోవైపు, అమూల్ వచ్చినా.. సంగం డెయిరీ డిమాండ్ తగ్గకపోవడంతో ప్రభుత్వంలో అసహనం పెరిగిందని అంటున్నారు. సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రనే అరెస్ట్ చేసే వరకూ పరిస్థితి ముదిరింది. పాల పంచాయితీ ఏపీలో రాజకీయంగా రచ్చ రేపుతోంది.