పైశాచిక ఆనందం.. అర్థరాత్రి అరాచకం.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటే ఇదేనా?
posted on Apr 25, 2021 @ 12:48PM
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటే ఇదేనా? పరిపాలన రాజధాని అంటే ఇలానే ఉంటుందా? అర్థరాత్రి ఈ అరాచకాలేంటి? కూల్చివేతలతో ఈ రాజకీయ కల్లోలం దేనికి? ఇదేనా పాలనంటే? ఇందుకేనా జగన్‌రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చింది? శిథిలాలతో రాజధాని నిర్మించాలని ఎవరైనా అనుకుంటారా? శాపనార్థాల మధ్య శాసించాలని ఎవరైనా కోరుకుంటారా? ప్రశాంత విశాఖలో ఈ బుల్డోజర్ల బరితెగింపు ఎందుకు? సాగర తీరంలో అధికార బల ప్రయోగం ఏ ప్రయోజనాలకు? ఇవీ ఇప్పుడు విశాఖవాసులు సర్కారును నిగ్గదీసి అడుగుతున్న ప్రశ్నలు. సబ్బం హరి, గీతం వర్సిటీ, పల్లా శ్రీనివాస్.. విశాఖలో టీడీపీ నేతల ఆస్తులే ప్రభుత్వ టార్గెట్. విధ్వంసమే వారి విధానం. అరాచకమే వాళ్ల అజెండా. కూల్చివేతల వెనుక రాజకీయ కుట్ర. పరిపాలనా రాజధానిలో ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడమే వారి వ్యూహం. అన్ని కలిసి.. వరుస కూల్చివేతలతో.. అర్థరాత్రి స్వాతంత్రాన్ని హరించివేస్తున్నాయి.
అర్థరాత్రి సమయం. విశాఖపట్నం ప్రశాంతంగా నిద్రపోతోంది. సాగర ఘోష మినమా మరెలాంటి అలజడి లేదు. అంతలోనే పాత గాజువాకలో గునపాలు, డ్రిల్లర్ల చప్పుడు. చెవులు చిట్లిపోయేంత సౌండ్. అంతెత్తున కట్టిన కాంక్రీట్ భవనాన్ని బలవంతంగా కూల్చేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. ఆ బిల్డింగ్ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కి చెందింది. రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదంటూ భవనాన్ని కూల్చేశారు సిబ్బంది. కనీసం ఉదయం వరకు కూడా ఆగలేదు. తెల్లారితే ప్రజలు తిరగబడతారనే భయమేమో. అర్థరాత్రి బలప్రయోగంతో భవనాన్ని పడగొట్టేశారు. శనివారం రాత్రి వరకూ గాజువాక సెంటర్‌లో గంభీరంగా కనిపించిన ఆ భవనం.. తెల్లారేసరికి శిథిల భవనంగా మిగిలింది. ప్రభుత్వ అరాచకాలకు మరో నిదర్శనంగా మారింది.
పల్లా శ్రీనివాస్ మామూలు నాయకుడు కాదు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సుదీర్ఘ దీక్ష చేసి వార్తల్లో నిలిచారు. ప్రజల పక్షాన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం.. అధికార పార్టీకి ఆగ్రహం తెప్పించింది. ఆ దీక్షకు ఫలితమే.. ఇప్పుడీ పనిష్మెంట్. అందుకే, ఆయన్ను టార్గెట్ చేశారంటున్నారు. అర్థరాత్రి పల్లా శ్రీనివాస్ బిల్గింగ్ కూల్చివేతకు రాజకీయ కుట్రే కారణమంటున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా బిల్డింగ్ ఎలా కూల్చేస్తారనేది పల్లా శ్రీనివాస్ ప్రశ్న. ఇంత అర్థరాత్రి దొంగల్లా భవనం మీద పడటమేంటని నిలదీత. వైసీపీలోకి రావాలని తనను ఎంపీ విజయసాయిరెడ్డి ఆహ్వానించారని.. తాను వైసీపీలో చేరనందుకే తన భవనాన్ని కూల్చివేశారనేది పల్లా శ్రీనివాస్ ఆరోపణ. తన భవనాన్ని కూల్చి విజయసాయిరెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని పల్లా మండిపాటు.
విశాఖలో ఇలా అర్థరాత్రి కూల్చివేతల పర్వం ఇదే మొదటిది కాదు. గతేడాది అక్టోబర్‌లో ఇలాంటివే రెండు ఘటనలు జరిగాయి. గతంలో విశాఖలో టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ జేసీబీలు, వందలాదిమంది పోలీసులతో సీతమ్మధారలోని ఆయన నివాసం దగ్గర తెల్లవారుజాము 3.30 గంటలకు విధ్వంసం సృష్టించడం అప్పట్లో కలకలం రేపింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంరటూ అప్పుడూ పల్లా శ్రీనివాస్ లానే సబ్బం హరి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకుంటేగా! ఉదయానికల్లా పని పూర్తి చేసి వెళ్లిపోయారు. జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్న వారిలో సబ్బంహరి ఒకరు కావడంతో... ఇదంతా ‘కక్ష సాధింపులో భాగమే’ అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత గీతం వర్సిటీ ఎపిసోడ్. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించిందంటూ అధికారులు తెల్లవారుజామున కూల్చివేతలకు పాల్పడ్డారు. భారీ పోలీస్ బలగాల నుడమ.. గీతం వర్సిటీ ప్రధాన గేటు, కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ బ్లాక్స్‌లను బుల్డోజర్లతో కూల్చేశారు. ఫెన్సింగ్ చుట్టి.. ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పాతేశారు. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత అయిన శ్రీభరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉండటంతో.. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనంటూ అప్పుడు సైతం ఇలానే రచ్చ రచ్చ జరిగింది.
ఇలా.. టీడీపీకి చెందిన సబ్బం హరి, భరత్, పల్లా శ్రీనివాస్‌లకు చెందిన ఆస్తుల కూల్చివేతలు.. జీవీఎమ్‌సీని ముందుంచి చేస్తున్న రాజకీయ ప్రేరేపిత దాడులేననేది ప్రతిపక్ష పార్టీ ఆరోపణ. కూల్చివేతలకు అధికారులు ఎంచుకొన్న సమయం, కూల్చిన తీరుతో రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. ఏమీటీ సైకోయిజం? అంటూ గతంలోనే చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ డైరెక్షన్‌లో.. ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న అరాచకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనా రాజధాని అంటే.. కూల్చివేతలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమేనా? అంటూ ప్రశ్నించారు. జగన్‌రెడ్డి సర్కారు చేస్తున్న అర్థరాత్రి అరాచకాలకు సరైన సమయంలో ప్రజలే సరైన బుద్ధి చెబుతారని మండిపడ్డారు.
విశాఖలో ప్రతిపక్షానికి బలమైన నాయకత్వం లేకుండా వారిని నయానో, భయానో లొంగదీసుకోవడమే వైసీపీ వ్యూహం. అందుకే ఇలా కూల్చివేతలతో వారిపై పొలిటికల్ ప్రెజర్ పెంచుతోంది. చిన్న చిన్న లొసుగులను బూచీగా చూపించి.. అర్థరాత్రి బుల్డోజర్లను, పోలీసులను మోహరించి.. తమ దారికి తెచ్చుకునే కుతంత్రం అమలు చేస్తోంది. ఇప్పటికే గంటా శ్రీనివాసరావుకు గాలం వేశారు. ఆయన వారి వలకు చిక్కిచిక్కనట్టు వ్యవహరిస్తున్నారు. సబ్బం హరి, శ్రీ భరత్, పల్లా శ్రీనివాస్‌లకు కూల్చివేతలతో హెచ్చరికలు పంపించారు. కుదిరితే వారిని పార్టీలో చేర్చుకోవడం.. కుదరకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నోళ్లు మూయించడం.. ఇదే వైసీపీ ప్రభుత్వ విధానం.. అందుకే ఈ అర్థరాత్రి కూల్చివేతల అరాచకం.. అంటోంది ప్రతిపక్షం.