పరీక్షలో నెగిటివ్.. ఊపిరాడక గంటలోనే మృతి!
posted on Apr 25, 2021 @ 3:35PM
కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా పట్టి పీడిస్తోంది. జ్వరం వస్తే చాలు జనం వణికిపోతున్నారు. సాధారణ జ్వరమో, కరోనా రోగమో తెలియక భయపడి పోతున్నారు. కరోనా టెస్టుల ఫలితాల్లోనూ తప్పులు జరుగుతుండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. రాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో గందరగోళ ఫలితాలు వస్తున్నాయి. కరోనా లక్షణాలున్నా కొందరికి పరీక్షలో నెగిటివ్ వస్తోంది. ఎలాంటి లక్షణాలు లేనివారికి పాజిటివ్ వస్తోంది. దీంతో నెగిటివ్ వచ్చిన వారు సంతోషంగా ఉంటున్నా.. కొన్ని రోజులకే వారికి పరిస్థితి విషమిస్తోంది. కొందరు ప్రాణాలు కూడా పోగుట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా నిర్ధరణ పరీక్ష కోసం రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. తనతో పాటు భార్యను తీసుకెళ్లాడు. పరీక్ష చేయించుకున్న తర్వాత నెగిటివ్ అని తేలింది. దీంతో భార్యభర్తలిద్దరు సంతోషపడ్డారు. కాసేపు చెట్టు కింద సేదతీరదామని భర్త అంటే ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. అంతలోనే అతను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. గమనించివ భార్య ఏం చేయాలో పాలుపోక గందరగోళానికి గురైంది. ఏమవుతుందో అర్థమయ్యే లోపే అతను మృతి చెందాడు.
కళ్ల ముందే కట్టుకున్న వాడి ఊపిరి ఆగిపోవడం చూసి ఆ మహిళ గుండెలవిసేలా రోదించింది. కరోనాతో మృతి చెందాడో లేదో కానీ.. చావైనా.. బతుకైనా తనతోనేని అనుకున్న ఆ మహిళ.. తన పెనిమిటి ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఏమయ్యా.. లేవయ్యా.. ఇంటికి పోదాం పదా పిల్లలు ఎదురు చూస్తుంటారు అంటూ ఆమె రోదించిన తీరు అక్కడున్న వారి చేత కంటతడి పెట్టించింది.