కబ్జాలపై సీఎందే ట్రైనింగ్ !
posted on Apr 24, 2021 @ 5:19PM
కొవిడ్ మహమ్మారి సమయంలోనూ తెలంగాణలో రాజకీయ మంటలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అధికార టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓరుగల్లు ప్రజలు కబ్జాకోరులను అడ్డుకుంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ ఉంది.. ఆ కోచ్ ఫ్యాక్టరీకి కోచ్ కేసీఆరే అని చెప్పారు. కబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే కబ్జాలు పెరిగాయని బండి సంజజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీ షీటర్లు, తలలు నరికిన వారికి, నగర బహిష్కరణ చేసిన వ్యక్తులకు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని బండి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేశామని భద్రకాళీ గుడి వద్ద ముక్కునేలకు రాయాలని ఆయన సవాల్ చేశారు. వరంగల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సమస్యలపై బీజేపీ పోరాటం చేసింది, అందుకే ప్రజల నుంచి అనూహ్య స్పందన కన్పిస్తోందని తెలిపారు. అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలిందన్నారు బండి సంజయ్. సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉండడంతో అధికార టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులను చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు.