ఏపీలో దొంగల రాజ్యం! కరోనా కల్లోలంలో కూల్చివేతలా..
posted on Apr 25, 2021 @ 10:13AM
విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఇంటిని జీవీఎంసీ అధికారులు కూల్చడంపై రాజకీయ రచ్చ సాగుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి అధికారులు ఇంటిని కూల్చడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. జనాలంతా కరోనాతో వణుకుతుంటే.. జగన్ రెడ్డి సర్కార్ ఇలాంటి చర్యలకు దిగడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో జగన్ రెడ్డి బిజీగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చివేతపై స్పందించిన .. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి కార్మికుల పక్షాన నిలిచినందుకే పల్లా శ్రీనివాస్‌పై కక్ష చర్యలకు దిగారన్నారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధవాతవరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి జేసీబీ ఊపులకు భయపడే వారు ఎవరూ లేరని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా ఉండటానికి టీడీపీ దేనికైనా సిద్ధమేనని నారా లోకేష్ స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలి, పనిదినాల్లో అక్రమాలు, సెలవుదినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడ్డట్టు కోర్టు సెలవు రోజుల్లోనే జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష్య పూరితంగా టీడీపీ నేతల ఇల్లు, భవనాలు కూల్చివేస్తోందని మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున దొంగల్లా వచ్చి భవనాన్ని కూల్చడం దారుణమన్నారు. విద్వేషం, విధ్వంసం లేకుండా వైసీపీకి ఉనికి లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రజా వేదిక మొదలు ప్రతిపక్ష నేతల ఇళ్లు ఎన్ని కూల్చారో లెక్కేలేదన్నారు. రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా? లేక రాక్షసులు పాలిస్తున్నారా? అన్నది అర్ధం కావడంలేదన్నారు. రోజురోజుకి వైసీపీ రాక్షస సంస్కృతి శృతి మించుతోందన్నారు. అధికారం శాశ్వతం కాదని, తగిన మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.