ఏపీలో ఆగని కక్ష రాజకీయం.. టీడీపీ నేత ఇల్లు కూల్చివేత
posted on Apr 25, 2021 @ 9:41AM
దేశమంతా కరోనా కల్లోలంతో అల్లాడుతోంది. మహమ్మారి పంజాతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విలయ తాండవం చేస్తోంది. కొన్ని రోజులుగా 11 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనాతో జనాలు వణికిపోతుండగా ఏపీ సర్కార్ మాత్రం కక్ష రాజకీయాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సంగం డెయిరీ కేసులో శనివారం తెల్లవారు జామున టీడీపీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్రను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే విశాఖలోని టీడీపీ నేత ఇంటిని జీవీఎంసీ అధికారులు రాత్రికి రాత్రే కూల్చేశారు.
విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కి చెందిన బిల్డింగ్‌ను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు బిల్డింగ్‌ను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో నిర్మాణాన్ని తొలగించడం అన్యాయమని..నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా తొలగిస్తారని జీవీఎంసీ సిబ్బందిని ప్రశ్నించారు. రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదంటూ బిల్డింగ్ కూల్చివేశామని అధికారులు తెలిపారు. రాత్రికిరాత్రే భవనాన్ని కూల్చివేస్తారని అధికారులపై మండిపడ్డారు. దీనిపై సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా భారీగా పోలీసులు మోహరించారు.