అడ్డుకుంటే ఉరి.. ఆక్సిజన్ ఆటంకంపై కోర్టు వార్నింగ్..
posted on Apr 24, 2021 @ 2:56PM
జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రాణవాయువు అందించలేకపోవడం నేరపూరిత చర్య. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక్క సందర్భాన్ని తమ దృష్టికి తీసుకురావాలనీ.. అతడిని తాము ‘‘ఉరి తీస్తా’’మని కోర్టు తెలిపింది. ‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’’ అని ఢిల్లీ హైకోర్టు
ధర్మాసనం హెచ్చరించింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునేలా.. వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ ప్రభుత్వంతో పాటు పలు ఆసుపత్రులు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ సందర్భంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరైనా ప్రాణవాయువు సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలను తప్పవని హెచ్చరించింది. ‘ఇది సెకండ్ వేవ్ కాదు, సునామీ. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తారస్థాయి చేరలేదు. మే నెల మధ్యలో ఆ సంఖ్యను దాటవచ్చు. అందుకు ఎలా సిద్ధమవుతున్నాం’ అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.
ప్రస్తుతం రాజధాని నగరానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లభించకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుందని విచారణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొరత కారణంగా గత 24 గంటల్లో దారుణమైన ఘటనలు కళ్ల ముందు కనిపించాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం కేవలం 297 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేంద్రం నుంచి లభించిందని చెప్పింది కేజ్రీవాల్ సర్కారు.
స్పందించిన కోర్టు.. ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎప్పుడు లభిస్తుందంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. అలాగే ఆక్సిజన్ సరఫరాకు అడ్డుపడే వారి వివరాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే సొంతంగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రాణవాయువు అందించలేకపోవడాన్ని నేరపూరిత చర్యగా అభివర్ణించిన కోర్టు.. జీవించడం ప్రజల ప్రాథమిక హక్కని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. సరఫరాకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.