లాక్ డౌన్ తోనే కరోనా కట్టడి! ముంబైలో తగ్గుతున్న కేసులు
posted on Apr 25, 2021 @ 11:51AM
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్ విధించగా... చాలా రాష్ట్రాల్లో నెట్ కర్ఫ్యూ అమలవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లోకల్ గానే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. అయితే కరోనా కట్టడికి లాక్ డౌన్ ఏకైక మార్గమని తెలుస్తోంది. కరోనాతో విలవిలలాడిన ముంబైలో లాక్ డౌన్ తర్వాత కేసులు కొంత తగ్గడమే ఇందుకు నిదర్శనం.
కరోనా కేసులు భారీగా పెరగడంతో మహారాష్ట్ర సర్కార్ లాక్‌డౌన్ అని చెప్పకున్నా... దాదాపుగా అలాంటి తరహాలోనే కఠిన రూల్స్ అమలు చేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముంబై నగరంలో సత్ఫలితాలనిచ్చింది. ముంబైలో గతంతో పోల్చుకుంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. ఏప్రిల్ 4న ముంబైలో 11,163 కేసులు నమోదు కాగా.. శనివారం కేవలం 5,888 కరోనా కేసులే నమోదయ్యాయి. లాక్‌డౌన్ వల్ల ముంబైలో కరోనా వ్యాప్తి తగ్గిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 19న కూడా ముంబైలో 8000 కేసులు నమోదయ్యాయి. కానీ.. కేవలం వారం రోజుల గడిచే సరికి 24 గంటల్లో 5,888 కరోనా కేసులే నమోదు కావడం ముంబై నగర ప్రజలకు కాస్త ఊరట కలిగించే విషయం.ముంబైలో ఆదివారం నమోదైన కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా శనివారంతో పోల్చుకుంటే తగ్గింది. ముంబైలో ఆదివారం కొత్తగా 5,192 కరోనా కేసులు, 46 కరోనా మరణాలు నమోదయ్యాయి.
ముంబైలో పాజిటివిటీ రేట్ కూడా గత వారం 18 శాతం ఉండగా.. ప్రస్తుతం 15 శాతానికి పడిపోయింది. శుక్రవారం ముంబైలో 7,221 కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం 5,888 కేసులు మాత్రమే నమోదయ్యాయి. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారానికి కొత్తగా నమోదయిన కేసుల సంఖ్య 20 శాతం తగ్గింది. ముంబైలో లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్లనే కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముంబై నగరంలో మొత్తం 120 కంటైన్మెంట్ జోన్లను ప్రభుత్వం గుర్తించింది. మే 1 వరకూ ముంబైలో కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది.మే 1 తర్వాత కూడా ఈ ఆంక్షలను పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.