కేసీఆర్ కు గాంధీలో చికిత్స! యువకుడి నిరసన
posted on Apr 24, 2021 @ 3:27PM
తెలంగాణలో కొవిడ్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా ఏడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు భారీగా పెరిగిపోయాయి. రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నిండిపోయాయి. బాధితులకు బెడ్లు దొరక్క, సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకడంతో ఆయన తన ఫాంహౌజ్ లో క్వారంటైన్ లో ఉన్నారు. మంత్రి కేటీఆర్. ఎంపీ సంతోష్ కుమార్ కుడా కరోనా భారీన పడి ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ రోగులకు చికిత్స అందించే హైద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఎదుట కరీంనగర్ కు చెందిన యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు.
పేద, మధ్య తరగతి రోగుల కోసం కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని, లేకుంటే సీఎం కెసీఆర్, మంత్రి కేటీఆర్లను గాంధీ ఆస్పత్రిలో చేర్చాలంటూ ఆ యువకుడు ప్లకార్డు ప్రదర్శించారు. కరోనా విళయతాండవం చేస్తున్న మన రాష్ట్రంలో ఇదే అదునుగా భావిస్తూ ఎన్నో ప్రయివేటు ఆసుపత్రులు కరోనా వైద్య చికిత్సల పేర పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటూ, మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సదుపాయాలు లేని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయివేటు హాస్పిటల్ లో చెర్పించి అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా బారిన పడ్డ సీఎం కేసీఆర్ ఇటీవల టెస్టుల కోసం యశోదా హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వస్తే ఎంతటి పెద్దోడైనా గాంధీకి వెళ్లాల్సిందే అన్న సీఎం.. ప్రైవేట్ ఆసుపత్రికి ఎలా వెళతారంటూ పలువురు వ్యాఖ్యానించారు. పెద్దలకు ఓ న్యాయం.. పేదలకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. అందులో భాగంగానే తాజాగా ఈ యువకుడి ఫొటోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు