కేశినేనీ.. నీ రూటు ఏ గూటికి?
posted on Jul 22, 2022 @ 12:52PM
విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని సొంత పార్టీ తెలుగుదేశంపైన కొంతకాలంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరోసారి టీడీపీపై తన ట్విట్టర్ పేజీలో సంచలన వ్యాఖ్యలు పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో నాని మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారమే లేపాయి. తాజాగా సోషల్ మీడియాలో కూడా సొంత పార్టీ నేతలపై కేశినేని నాని నిప్పులు చెరుగుతూ పోస్టులు పెట్టారు. వారి తీరు చూస్తుంటే తనకు ‘యదార్థవాది.. లోక విరోధి’ సామెతను గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. తనను కొన్ని రోజులు బీజేపీలోకి.. మరి కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకుని.. పార్టీని పటిష్ట పరుచుకుని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది’ అంటూ పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
కేశినేని నాని టీడీపీకి దూరమయ్యే క్రమంలోనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారనే విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కేశినేని నానికి విజయవాడ టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, మరో నేత నాగుల్ మీరాతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. కేశినేని నాని తన బస్సుల వ్యాపారం విషయంలో అప్పటి రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ఫైర్ అయ్యారు. అనంతరం నాని తన బస్సుల వ్యాపారం వదిలిపెట్టారు . కేశినేని నాటి 2019లో మరోసారి ఎంపీగా గెలిచిన తర్వాతే విజయవాడ నగర టీడీపీలో ముసలం మొదలైందంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ విభేదాలు మరింతగా ముదిరిపోయాయంటున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలో బుద్దా, నాగుల్ మీరా- కేశినేని నాని మధ్య వివాదం రేగింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేత పేరు ప్రచారంలోకి వచ్చింది. అందుకు బుద్దా, నాగుల్ మీరా వర్గాలు ససేమిరా అన్నాయి. దీంతో కేశినేనికి వారిపై ఆగ్రహం వచ్చిందని చెబుతారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేశినేని నాని గతంలోనే ప్రకటించారు. నాని సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న తీరుతో.. పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో నాని సోదరుడు కేశినేని చిన్నికి వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా నిలబెడుతుందని అంటున్నారు. ఆ అక్కసుతోనే నాని తన సోదరుడిపైన పోలీసులకు, లోక్ సభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారంటున్నారు.
తన ఎంపీ స్టిక్కరును కారుకు అంటించుకుని ఒక అజ్ఞాత వ్యక్తి తిరుగుతున్నాడంటూ కేశినేని నాని పోలీసులకు, లోక్ సభ కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు.. నాని సొంత తమ్ముడు కేశినేని చిన్ని. టీడీపీ వ్యవహారాల్లో చిన్ని చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ పార్టీకి దూరం జరిగే యత్నాల్లో నాని ఉన్నారని, అందుకే చిన్నిపైన, ఆయన సతీమణి పైన ఫిర్యాదులు చేశారంటున్నారు.
నిజానికి కేశినేని నానికి బీజేపీ ముఖ్య నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన వైసీపీ నాయకులతో చనువుగా ఉంటున్నారట. ఈ ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతోంది. ఈ క్రమంలోనే నాని పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే.. ఆయనకు ఢిల్లీ పెద్దల భరోసా ఏమైనా ఉందా? లేక ఫ్యాన్ పార్టీ ప్రోద్బలం ఉందా? అనే సందేహాలు పలువురిలో వస్తున్నాయి. కేశినేని నాని ఇలా ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనే అంశంపై టీడీపీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. నాని ఇంతలా బరితెగించి మాట్లాడడం వెనుక ఎవరి హస్తం ఉంది? వైసీపీ నేతల ప్రోద్బలం ఉందా? లేక కమలం పార్టీ వెన్నుదన్ను ఏదైనా నానికి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడప్పుడూ టీడీపీ నేతలు పరోక్షంగా చెబుతున్నట్లు కేశినేని నాని వైసీపీలో చేరతారా? లేదా భారతీయ జనతాపార్టీ తీర్థం తీసుకుంటారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి.