దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
posted on Jul 22, 2022 7:11AM
అంతా కేంద్రం అనుకున్నట్లే జరిగింది. విపక్షాలు ఊహించిన అద్భుతమేమీ జరగలేదు. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. తిరుగులేని మెజారిటీతో ఆమె విజయం ఓట్ల లెక్కింపునకు ముందే ఖరారైంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఆమె మొత్తం 64శాతం ఓట్లు సాధించిట్లు తేలింది. ఎంపలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ద్రౌపది ముర్ముకు ఆరు లక్షల 76 వేల 803 ఓట్లు దక్కాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మూడు లక్షల 80 వేల 117 ఓట్లు లభించాయి.
ఇప్పటి వరకూ దేశ రాష్ట్రపతులలో ద్రౌపది ముర్ముయే అతి పిన్న వయస్కురాలు. ఇలా ఉండగా ఓట్ల లెక్కుంపు మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికే ఆమెకు 53శాతం ఓట్లు దక్కడంతో ఆమె విజయం ఖరారైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించి ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా విపక్షాలు ఆశించినట్లుగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అయితే అది విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా కాకుండా ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు అనుకూలంగా జరిగింది.
విపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ముఖ్యంగా అసోం, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని భావిస్తున్నారు. విశేషమేమిటంటే బీజేపీకి కానీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కానీ అసలు ప్రాతినిథ్యమేలేని ఏపీలో మర్ముకు వంద శాతం ఓట్లు లభించాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూడా ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు పలికి ఆమెకే ఓటేశారు. ముర్ము తిరుగులేని విజయం అనంతరం తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉంటుందని ప్రకటించారు. దాంతో ఉప రాష్ట్రపతిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది.
రాష్ట్రపతి ఎన్నిక ఫలితం వెలువడగానే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులు ఆజాదీగా అమృతోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో తూర్పు భారత దేశంలోని మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా ఎన్నుకుని చరిత్ర దేశం చరిత్ర సృష్టించిందని మోడీ ట్వీట్ చేశారు.