కిషన్ రెడ్డి.. అబద్ధాలాడటమైనా నేర్చుకో!
posted on Jul 22, 2022 @ 12:52PM
పిల్లలు చాక్లెట్ల కోసం అబద్దాలాడతారు, సినిమాకి వెళ్లడానికి కుర్రాళ్లు అబద్దాలాడతారు, మరి కేంద్ర మంత్రి బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి అబద్దాలాడటమే యావత్ తెలంగాణాను ఆశ్చర్యపరుస్తోంది. అసలే తెలంగాణా ప్రజలు భారీవర్షాలు, వరదల్లో కష్టాల్లో పడి ఉంటే కేంద్రం జాతీయ విపత్తు సహాయ నిధులు (ఎన్‌డీఆర్ఎఫ్) ఇచ్చిందంటూ కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్డీఆర్‌ఎ్‌ఫకు, ఎస్డీఆర్ ఎఎఫ్(రాష్ట్ర విపత్తు సహాయ నిధి)కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నా రని ఎద్దేవా చేశారు. గతంలో హైదరాబాద్‌లో వరదలతోపాటు ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇవ్వాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్ నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే కిషన్‌రెడ్డి అబద్ధాలు వల్లె వేస్తున్నారని విమర్శించారు.
ఈనెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో చేసిన ప్రకటనను ఒకసారి చదువుకోవాలని కిషన్‌రెడ్డికి హితవు పలికారు. రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుందన్న విషయా న్ని కిషన్‌రెడ్డి అర్థం చేసుకోవాలి. 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్డీ ఆర్‌ఎఫ్ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదంటూ కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చేసిన ప్రకటన తప్పా? లేక.. కిషన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తన సహచర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటనను కిషన్‌రెడ్డి ఓ సారి పూర్తిగా చదవాలని, ఆ తర్వాతే సమాధానం చెప్పాలని సూచించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చే ఎన్డీఆర్‌ఎఫ్ నిధులను అడిగే దైర్యం లేకనే కిషన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అంబాండాలు వేసిన కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల గుజరాత్‌లో 2021లో వరదలు వస్తే.. ప్రధాని మోదీ ఆగమేఘాల మీద సర్వే నిర్వహించి ఎన్డీఆర్‌ఎఫ్ ద్వారా వెయ్యి కోట్ల అదనపు సహాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోఉన్న బిహార్‌కు రూ.3,250 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.4,530 కోట్లు, కర్ణాటకకు రూ.6,490 కోట్లు, గుజరాత్‌కు వెయ్యి కోట్లు కలిపి.. ఎన్డీఆర్‌ఎఫ్ కింద మొత్తం రూ.15,270 కోట్లిచ్చిన కేంద్రానికి.. తెలంగాణకు నిధులు ఇచ్చేం దుకు ఎందుకు చేతులు రావడం లేదని కేటీఆర్ నిలదీశారు. అయా రాష్ట్రాల మాదిరిగానే మన రాష్ట్రానికి కూడా ఎన్డీఆర్‌ఎఫ్ కింద ఇచ్చిన అదనపు నిధులెన్నో దమ్ముంటే కిషన్‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు.