వరద బాధితుల కష్టాలు చూస్తుంటే గుండె తరక్కు పోతోంది.. చంద్రబాబు
posted on Jul 22, 2022 8:06AM
బటన్ నొక్కడమే తన పని అనుకుని తాడేపల్లి ప్యాలెస్ లో దర్జాగా కాలం వెళ్లదీస్తున్న ఏపీ సీఎం జగన్ ను జనం బటన్ నొక్కే ఇంటికి పంపేస్తారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శించిన ఆయన ఆ సందర్భంగా మాట్టాడారు.
జనానికి బటన్ నొక్కి డబ్బులిచ్చేస్తే చాలని భావిస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మరో శ్రీలంకగా మార్చేస్తున్న జగన్ ను గద్దె దింపడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. గోదావరి వరదలో ప్రజల కష్టాలను చూస్తే గుండె తరుక్కు పోతోందన్నారు. వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అవధులు దాటిందని దుయ్యబట్టారు. జనాలను బురదలోకి తోసేసి జగన్ గాలిలో తిరగడాన్ని తప్పుపట్టారు. నేరుగా వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు తీరిక లేదా అని ప్రశ్నించారు.
బురదలోనే నడుచుకుంటూ కూలిన ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. కోనసీమలో సోంపల్లి, చాకలిపాలెం జంక్షన్, మానేపల్లి, అప్పనపల్లి ప్రాంతాల్లో రాత్రి విస్తృతంగా పర్యటించి బాధితులతో మాట్లాడారు. వరద అంచనాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. ఎంత ప్రవాహం వస్తుంది. ఏ యే ప్రాంతాలకు ముంపు ముప్పు ఉంటుందన్నది ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి.. ముంపు ప్రాతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని, ప్రభుత్వం ఆ విషయంలో క్షంతవ్యం కాని నిర్లక్ష్యంతో వ్యవహరించిందని విమర్శించారు.
బాధితులకు భరోసా కలిగించాల్సిన సీఎం గాలిలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని దుయ్య బట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిత్లీ, హుద్‌హుద్, హరికేన్ తుఫాన్లు వచ్చినా తక్షణం స్పందించి సమర్థంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నామనీ, ఇప్పుడు గోదావరి వరదలో ప్రజల ఇబ్బందులను వైసీపీ పట్టించుకోలేదనీ, వారి బాధలు వారే పడాలన్నట్లుగా వదిలేసిందనీ విమర్శించారు. ప్రభుత్వం వరద బాధితుల కోసం పడవలు ఏర్పాటు చేయలేదు. కనీసం భోజనం కూడా పెట్టలేదన్నారు.
నాలుగు రోజుల పాటు వరద బాధితులను గోదావరికి వదిలేసి.. ఇప్పుడు తానొస్తున్నానని రెండు వేల రూపాయలు సాయం అంటూ ఇచ్చి నాటకాలాడుతున్నారని దుయ్య బట్టారు. రెండు వేల రూపాయలు వరదతో ఇంట్లో మేట వేసిన బురద కడుక్కోవడానికైనా సరిపోతుందా అని ప్రశ్రించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేవరకు మళ్లీ మళ్లీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. వరద బాధితులకు ప్రతి ఇంటికీ రూ. పది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే విలీన గ్రామాల ప్రజలు ఏపీలో ఉండం, తెలంగాణలో కలిపేయండని అంటున్నారన్నారు.