జగన్... వీళ్లా మీ నాయకులు..!
posted on Jul 22, 2022 @ 12:07PM
ఏమండి బాగున్నారా? .. చదువుకున్నవారు, మర్యాద తెలిసినవారి సాధారణ పలకరింపు. అంకుల్ పింకీ ఉందా.. ఏడో తరగతి పిల్లాడు అడిగే తీరు, ఆంటీ సుజీ కాలేజీకి వస్తుందా.. ఇంటర్ విద్యార్ధిని అడిగే ప్రశ్న.. మానవ సమాజంలో కాస్తంత స్పృహ ఉన్నవారంతా ఇలానే ప్రశ్నిస్తారు, పలకరిస్తారు. కానీ అసలు మానవ సమాజంలో లేన్నట్టుగా వ్యవహరిస్తూ, ఇతరులను దారుణంగా తిట్ల పురాణంతో అసభ్యంగా మాట్లా డేవారినీ ఇప్పుడు చూడాల్సి వస్తోంది, వినాల్సివస్తోంది. చిత్రమేమంటే అలాంటివారిని రాజకీ యా ల్లోకి కండువా కప్పి మరీ ఆహ్వానించి ప్రోత్సహించడం జరుగుతోంది. అందుకు వైసీపీ పార్టీ యే ఉదాహరణ. మనిషి అన్న వాడు ఎవ్వరూ బొత్తిగా వినకూడని, అస్సలు అంగీకరించని పద జాలంతో ప్రత్యర్థి పార్టీ నేతల మీద విరుచుకుపడే వారిని ఏరి కోరి పార్టీలోకి తీసుకుంటున్న ఘనత జగన్ సారథ్యంలోని వైసీపీకే దక్కుతుంది. నోటి దూల ఎక్కువ ఉన్నవారంతా ఆ పార్టీ వారిలో ఉన్నారా అనిపించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వారినా ప్రజా నాయ కులుగా చలామణీ అయ్యేందుకు అవకాశం ఇస్తున్నామన్న భయాందోళనలు ప్రజల వంతయింది.
తాజాగా రోజా రాణి అనే వైసీపీ నాయకురాలు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత మీద విరుచు కు పడ్డారు. ఏకంగా బూతుల పురాణంతో ప్రసంగమంతా సాగింది. విమర్శించడానికి, బూతులు తిట్టడానికి వ్యత్యాసం తెలీకుండా, నోటికి వచ్చిన బాషా చాతుర్యాన్ని ప్రదర్శించడం ద్వారా సదరు వైసీ పీ నాయకురాలు తన తీరును తన సంస్కారాన్ని జనం ముందు బయటపెట్టుకున్నారు. ఏకవచనంతో సంబోధించడం, బూతులతో రెచ్చిపోవడమే మీడియా సమావేశం సాక్షిగా ప్రసంగం అంతా సాగింది. విపక్షాల మీద దూకుడుగా విమర్శలు చేయాలంటే ఇంత దారుణమైన, దరిద్రమైన భాషను ఉపయో గించాలని ఆమెకు ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చారోగాని వారికి కనీసం మనిషి లక్షణాలు ఉంటయనడం కష్టం.
తమ నాయకుల మీద, వారి పరిపాలనా చాతుర్యం మీదా అపార భక్తి ఉండవచ్చు. అలాగని విపక్షాలను అపహాస్యం చేయడానికి, వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఒక పద్ధతి పాడూ ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని మనుషులను నాయకులుగా తయారుచేయడంలో వైసీపీ దే సిద్ధ హస్తం అనాలేమో. రాజకీ యాలు, పథకాలు లేదా మరో అంశాల గురించి విపక్షాల విమర్శల మీద తమ అభిప్రాయాలు, లేదా ప్రతి విమర్శలు చేయడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అది రాజకీయాలు తెలిసినవారికి, ఇతరులను గౌరవించాలన్న జ్ఞానం ఉన్నవారికే తెలుస్తుంది. కానీ తాజాగా వైసీపీలో మరో అజ్ఞాని, తిట్ల పురాణంలో ఆరితేరిన ఒక మహా నాయకురాలిని చూడాల్సి వస్తోంది. మొన్నటి దాకా అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నాని భాషా చాతుర్యం విని సిగ్గుతో, అసహ్యంతో టీవీలు కట్టేసిన జనం ఇపుడు రోజా రాణి అనే వైసీపీ నాయకురాలి భాష వింటే రాష్ట్రంలో మహిళలు టీవీలు పగలగొట్టేస్తారేమో. అసలు ఇలాంటి వారికి పార్టీ కండువా కప్పి, పార్టీ ఆఫీస్ లో ప్రెస్‌మీట్ పెట్టంచిన పార్టీ జనానికి ఏ సంకేతాలిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీనికాని, ప్రభుత్వాన్ని కానీ, ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శించినా నోటీసులు, కేసులు అంటూ హడావుడి చేసే పోలీసు వ్యవస్థకు ఇలా వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలంతో కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనే చేవ ఉందా ?
అసలు ఇలాంటి నాయకులను పార్టీలోకి ఎలా తీసుకుంటున్నారన్నదే రాజకీయ పరిశీలకుల ప్రశ్న. దీనికి సదరు పార్టీ అధినేత జగన్ సమాధానం చెప్పాలి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి పరిస్థితికి రాజకీయాలను తీసికెళుతున్నవారికి ప్రజల హృదయాల్లో స్థానం ఎలా ఉంటుంది?