ఉగాది నగదు పురస్కారం మరీ ఎక్కువేమో జగన్!
posted on Jul 21, 2022 @ 5:06PM
వెనకటికి ఓ పెద్దాయన మోకాలు నొప్పిగా ఉంది ఇంటికి తీసికెళ్లమని అడిగితే ఓ పోలీసాయన బండి మీద ఎక్కించుకుని మరీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాడు. దిగిన వెంటనే చిరునవ్వు నవ్వి శభాష్ అని బుజం తట్టి మామూలుగానే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. పోలీసాయనకు కోపంరాలేదు. నవ్వుకున్నాడు. పెద్దాయనలోనూ మహా నటుడు ఉన్నాడని. అదుగో అలా ఉంది జగన్ సర్కారు నిర్ణయం. ఉగాది పురస్కా రంలో భాగంగా వారికి ఇచ్చే నగదు బహుమతిని రూ.500 నుంచి రూ.150కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వర్షాలు, వరదలొచ్చి ఇల్లు మునిగిపోతున్నా, కుర్రకారు సెల్ఫీ వ్యామోహంలో ఏ నదిలోనో కొట్టుకు పోతు న్నా, పోనీ ఏ ఇల్లు తగలడుతున్నా పరుగున వచ్చి కాపాడేది, కనీసం వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లేది పోలీ సులు, అగ్నిమాపకదళంవారే. వారికి తన, పర తేడాలుండవు. వారి దృష్టిలో అందరూ సమానమే. ఎవరిక యినా అవసరమై పిలిస్తే సేవచేస్తారు. అది వారి వృత్తి ధర్మంగా భావిస్తారు. కానీ వారి సేవలకు తగిన పత కాలతో పాటు ఇచ్చేపారితోషికం కూడా కాస్తంత జేబు నిండేలా అన్నా ఇవ్వరు. పైగా ఇప్పుడు జగన్ ప్రభు త్వం కేవలం పతకానికే అధిక ప్రాధాన్యతనిస్తూ ఇచ్చే కాస్తింత నగదులోనూ కోత విధించడం దారుణం.
ఊళ్లో గొడవలు, ధర్నాలు, రౌడీల దాడులు జరుగుతున్నా అడ్డుకోవడానికి ఈల వేస్తే వచ్చేది పోలీసు బలగాలే. మరీ అవసరమైతే అగ్నిమాపక దళాలూ వచ్చేస్తాయి. వారి శిక్షణ అలా ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ అనే తత్వం ఇమిడి ఉంటుంది. వారి శిక్షణకు, వారి కష్టానికి ప్రభుత్వాలు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కేవలం వారు చనిపోయిన తర్వాత ఇంటికి పెన్సన్ డబ్బో, కాయితాలో పంపడం కాదు.
ఉగాది పురాస్కారాల పేరిట చేసే గౌరవ మర్యాదలూ మరింత గౌరవ ప్రదంగా ఉండాలి. కానీ జగన్ సర్కార్ మాత్రం ఈసారి నుంచి ఉగాది పురస్కారాలు ప్రత్యేకంగా పోలీసులు, అగ్నిమాపకదళాల వారికి ఇచ్చే పురస్కారంలో భాగంగా కేవలం పథకం, 150 రూపాయల నగదు మాత్రమే ఇవ్వాలని నిర్ణయిం చింది. గతంలో ఈ నగదు 500 రూపాయలు ఉండేది. దాన్ని రూ.150కి తగ్గించడం విని నవ్వాలో, ఏడ వాలో అర్ధంగావడం లేదు.