పతాక రూపకర్తకు ఇకనైనా భారత రత్న ఇస్తారా
posted on Jul 22, 2022 6:42AM
స్వాతంత్య్రదినోత్సవంనాడు మాత్రమే మనకు జాతీయ పతాకం మీద దృష్టి వెళుతుంటుంది. ఆ రోజే దేశభక్తి పెల్లుబుకుతుం టుంది. లతమంగేష్కర్, రఫీ పాడిన పాటలే దేశభక్తి పాటలుగా ప్రతీ నగరం, పట్టణం, పల్లెల్లో కూడా వినపడుతూంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడిన భజన వినపడుతూంటుంది. అంతే, తప్ప భారతీయులంతా ఎప్పటికీ గర్వపడే, ప్రాతః స్మరణీయుడు పింగళి వెంకయ్యగారు మాత్రం ఇవాళే గుర్తుకువస్తారు. దేశానికి జాతీయపతాకానికి మౌలిక రూపా న్నిచ్చిన మహానుభావుడు ఆయన. 1947లో ఇదే రోజున రాజ్యాంగ పరిషత్ సమావేశంలో భారతదేశ జాతీయ జెండా ప్రస్తుత రూపంలో ఆమోదించబడింది. చిత్రమేమంటే లతామంగేష్కర్‌కి, సుబ్బలక్ష్మిగారికీ ఇచ్చిన భారతరత్న మాత్రం ఇంతవరకూ ఇవ్వకపోవడం దురదృష్టకరం.
1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారు వివిధ జాతీయ పతాకాలను ఉపయోగించారు. కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య, 1921 ఏప్రిల్ 1న గాంధీ విజయవాడ నగర పర్యటన సందర్భంగా జాతీయ జెండాను రూపొందించి ఆయనకు అందించారు.
ప్రస్తుతం మనందరం చూస్తున్న పతాకం 1923లో ఉనికిలోకి వచ్చింది. దీనిని పింగళి వెంకయ్య రూపొందించారు. కుంకుమ, తెలుపు , ఆకుపచ్చ రంగు చారలతో తెల్లటి భాగంలో ఉంచారు. ఇది ఏప్రిల్ 13, 1923న నాగ్‌పూర్‌లో జలియన్‌వాలా బాగ్ ఊచ కోత జ్ఞాపకార్థం జరిగిన కార్యక్రమంలో ఎగురవేశారు. దీనికి స్వరాజ్ జెండా అని పేరు పెట్టారు, భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వం లోని స్వయం పాలన కోసం భారతదేశం డిమాండ్‌కు చిహ్నంగా మారింది.
పింగళి వెంకయ్య భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో 1876 ఆగష్టు రెండవ తేదీన జన్మించారు. పింగళి వెంకయ్య వ్యవ సాయదారుడు, మచిలీపట్నంలో విద్యా సంస్థను స్థాపించిన విద్యావేత్త కూడా. ఆయన 1963 జులై 4వ తదీన విజయవాడలో కనుమూశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించని గొప్ప దేశభక్తుడు ఆయన. 2009లో ఆయన స్మారకార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు. 2011లో మరణానంతరం ఆయనకు భారతరత్న ప్రదానం చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పింగళి వెంకయ్య గౌరవార్ధం స్టాంపును విడుదల చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన చేసింది.