క్రోయేషియా వెళ్లి తేళ్లతో తిరిగివచ్చింది!
posted on Jul 31, 2022 @ 11:45AM
ఎవరయినా వేసవి సెలవలకో, పోనీ సరదా ట్రిప్ అని వేరే దేశాలకో, వేరే ప్రాంతాలకో వెళుతూంటారు. అక్కడ కొంత కాలం గడిపిన తర్వాత తిరిగి వచ్చేప్పుడు అక్కడ నచ్చినవి ఏదో ఒక వస్తువు, దుస్తులో ఏదో ఒకటి కొని తెచ్చుకోవడం పరిపాటి. అవి చిరకాల జ్ఞపకాలనిస్తాయి. కానీ ఆస్ట్రేలియా నుంచి క్రోయేషియా వెళ్లిన ఒక మహిళ అక్కడంతా తిరిగి ఇల్లు చేరింది. తీరా వచ్చాక సూట్‌కేసు తెరిచి చూడబోతే ఏకంగా ఒక తేలు కుటుంబమే కనిపించి భయపడిపోయింది. అందులో ఒకటీ రెండు కాదు ఏకంగా తల్లితో పాటు పద్దెనిమిది చిన్న తేళ్లున్నాయి! పైగా అన్నీ బతికే ఉన్నాయి. ఇదెలా సాధ్యమన్నది ఆమెకీ అర్ధంకావడం లేదు. అసలు అందులోకి ఎప్పుడు, ఎలా వచ్చాయన్నది తెలీక ఖంగారుపడుతోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏ చిన్నదో ముద్దాడి తే ఆసీస్ మహిళ ప్రాణం పోయేదే.
క్రోయేషియాకి చెందిన ఆ తేళ్లు అరాక్నిడా జాతి తేళ్లని నిపుణులు తేల్చారు. అవి చిన్నవిగా ఉన్నా కుడితే మాత్రం మనుషుల ప్రాణాలు పోవడం ఖాయం. ఈ జాతి తేళ్లు రెండువేల రకాలు ఉన్నాయి. కానీ వీటిలో సుమారు 40 శాతం మేరకే విషపూరితమని అన్నారు. అయితే క్రోయేషియాలో సాధారణంగా కనిపించే తేళ్లలో చాలామటుకు ప్రమాదకరం కాదుట. కానీ మంట, దురద, నొప్పి ఉంటుందని నిపుణుల మాట. కాగా ఈ తేళ్లను ప్రస్తుతం జాగ్రత్త పరిచామని, త్వరలో క్రోయేషియాకి తిరిగి పంపనున్నట్టు అధికారులు తెలిపారు. ఇకనుంచీ విదేశాలకు, ముఖ్యంగా క్రోయేషియా ట్రిప్ వెళ్లినవారంతా సూట్‌కేసులు జర జాగ్రత్తగా చూసుకోవాలి. అందులోంచి ఏ బుజ్జి తేలో హాలో అంటే..!