టీఆర్ ఎస్ పని అయిపోయింది..బండిసంజయ్
posted on Jul 31, 2022 @ 4:06PM
ఆధిపత్యంలోకి రావడానికి అనేక ఎత్తుగడలు.. బీజేపీ వారిది మాత్రం దబాయింపు వ్యవహారం. తాము తప్పకుండా అధికారం లోకి వచ్చేస్తున్నాం ఇక మూటామూల్లూ సర్దుకోండని విపక్షాలనుద్దేశించి ప్రసంగాలు చేయడం పరిపాటి అయింది. అందు లోనూ ఇది సర్వేల కాలం. ఎవరికి వారు వారికి తగ్గట్టు సర్వేలు చేయించుకోవడం, లేదా చేయడం చాలా సులభ సాధ్యంగా అయిపోతోం ది. తందానా అంటే తానతందానా లా తయారయ్యాయి సర్వే సంస్థలు కూడా. ఇప్పుడు బీజేపీ వారి ప్రభంజనానికి తిరుగులేదని సర్వేల సంస్థలతో చెప్పించుకోవడం, ప్రచారం చేయించుకోవడంతో పాటు బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అదే నినాదాలు చేయించడం మామూలే. ఇప్పడు తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అదే స్వరం వినిపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయానికి టీఆర్ ఎస్ ఉండదని అన్నారు.
మీడియాతో మాట్లాడుతూ, అసలు పార్టీ నిల బడటమే కష్టమ న్నపుడు ఎన్ని సీట్లు వస్తాయనే చర్చకే అవకాశం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయమని, ఎంఐఎం సీటు కూడా తాము కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ ఇప్పుడు చెల్లని రూపాయని, ఆయన బొమ్మతో గెలవడం కష్టమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జంకు తున్నారన్నారు. అందుకే ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ మళ్లీ మాట్లాడటం లేదని చెప్పారు. మునుగోడుకు ఉప ఎన్నిక రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని, ఉద్యోగులకు వేతనాల ఆల స్యం, వరదలు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి ఉప ఎన్నికపై మరలుతుందని ఆయన నమ్మకమేమో అని వ్యాఖ్యానించారు. ఇక, ఉపఎన్నిక జరగవద్దని కాంగ్రెస్ కోరుకుం టోందన్నారు. ప్రజల అభీష్టం మేరకే బీజేపీ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొ న్నారు. క్యాసినో వ్యవహారం బయటపడగానే టీఆర్‌ఎస్ నాయకులు భయపడు తున్నారన్నారని, చీకటి దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా టీఆర్‌ఎస్ మారిందని ఆరోపించారు.
కాగా, ఈటెల రాజేందర్ మాత్రం గజ్వేల్ టికెట్ గ్యారంటీ అని అక్కడినుంచే పోటీచేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. పైగా సీఎంను దమ్ముంటే అక్కడి నుంచి పోటీచేయాలని సవాలు కూడా విసురుతున్నారు. మరోవంక బండి సంజయ్ మాత్రం ఈటెల టిక్కెట్ విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని అంటున్నారు. మరి పార్టీలోకి తీసుకున్నపుడు పెట్టుకున్న నమ్మకం ఈటెల మీద ఇపుడు సన్నగిల్లిందా లేక ఆయన్ను కరివేపాకులా ఉపయోగించుకుంటున్నారా అని విశ్లేషకుల అనుమానం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంచి వ్యక్తి అని సంజయ్ కితాబిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ఆయనకు ఎప్పటినుంచో నమ్మకం ఉందని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డితో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అంశాన్ని మీడియా సంజయ్ దృష్టికి తీసుకువెళ్లగా, బహుశా ఉత్తమ్ కూడా బీజేపీలోకి వస్తారేమో అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ పాతబస్తీలోనూ చక్రం తిప్పుతామని ధీమా వ్యక్తం చేశారు. మలక్‌పేట, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, గోషామహల్‌లో మాకు మంచి పట్టుంది గనుక ఎంపీ స్థానం ఎందుకు గెలువం? యూపీలో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ఆజంగఢ్‌నే బీజేపీ గెలుచుకున్నప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదు? మజ్లి్‌స్‌ను వద్దని బీజేపీయే కావాలని ముస్లింలు కోరు కుంటున్నారు. మాకు షెల్టర్ జోన్‌లుగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధిని నక్సల్స్ అడ్డుకునేవారు. ఇప్పుడు పాతబస్తీలో అభివృద్ధిని మజ్లిస్ అడ్డుకుంటోంది అని సంజయ్ ఆరోపించారు.