సోనియా వర్సెస్ స్మృతి ముదురుతున్న వివాదం
posted on Jul 30, 2022 @ 4:05PM
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, గాంధీ ఫ్యామిలీల మధ్య వైరం గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ, ఉత్తర ప్రదేశ్ లోని అమేథి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ పై పోటీ చేశారు. అప్పటి నుంచి గాంధీ ఫ్యామిలీ స్మృతి ఇరానీ, మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. 2014లో స్మృతి ఇరానీ ఓడిపోయినా, 2019లో రాహుల్ గాంధీని సొంత నియోజక వర్గంలో ఓడించి విజయం సాధించారు.
ఇక అప్పటి నుంచి స్మృతి ఇరానీ సోనియా, రాహుల్ గాంధీ పై విమర్శల జోరు మరింతగా పెంచారు. ఏ చిన్న అవకాశం చిక్కినా వదలకుండా దాడి చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరి చేసిన వివాదస్పద వ్యాఖ్యల విషయంగా, లోక్ సభలో స్మృతి ఇరానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్ చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని చాలా గట్టిగా డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఇందుకు సంబధించి కాంగ్రెస్ కమ్యూనికేషన్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా,పార్టీ అధికార ప్రతినిధి నెత్తా డిసౌజా చేసిన ట్వీట్స్ పై స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు.
కాగా, శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ నేతలకు భారీ షాకిచ్చింది. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు నోటీసులు జారీ చేసింది. పరువునష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆగస్టు 18వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గోవాలో బార్ సంబంధించి చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా డిలీట్ చేయాలని కోర్టు తెలిపింది.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామని కౌంటర్ ఇచ్చారు. అసలు వాస్తవాలను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.