మధ్య నిషేధమా .. ఛీ ఛీ ఆ మాటే అనలేదు!
posted on Jul 30, 2022 @ 7:57PM
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ... అవును, ఇచ్చిన మాట ఇవ్వలేదని, చెప్పిన మాట చెప్పలేదని, బుకాయించి బతికే వాళ్ళును చూసే కావచ్చును, సుమతీ శతకకారుడు, ఈ మాట చెప్పి ఉంటారు. నిజమే, రాజకీయాల్లో మరీ అంతగా మాట మీద నిలబడే వారు ఎవరూ ఉండకపోవచ్చును,కానీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం నవ్విపోదురు గాక నాకేటి.. సిగ్గు అన్నట్ల్గు, మాట తప్పం అంటూనే తప్పుతున్నారు. ఇలా అన్నది అనలేదని, చెప్పిన మాట చెప్పలేదని తప్పించుకు తిరుగువారు, బహుశా, ఇంకెక్కడా, ఇంకే రాష్ట్రంలోనూ ఉండరేమో.
ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తామని చెప్పడమే కాదు, గుజరాత్, బీహర్ రాష్ట్రాలతో పోలిక కూడా తెచ్చారు. మధ్యనిషేధం అమలులో ఉన్న గుజరాత్ ఆర్థిక వృద్దిలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని, ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని అప్పటి తెలుగు దేశం ప్రభుత్వానికి సుద్దులు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం విచ్చల విడిగా మద్యం అమ్మిస్తోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి బుద్దుంటే సంపూర్ణ మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం మధ్య నిషేధం తెచ్చినా తేకున్నా, తమ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మధ్య నిషేధం తీసుకోస్తామని, ‘ఘట్టి’ గా చెపుతున్నాని, మీడియా సాక్షిగా చెప్పారు. ఎన్నికల ప్రణాళికలోనూ అంచెల వారీగా మధ్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
కానీ, ఇప్పడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రి, గుడివాడ అమర్నాథ్ మద్యనిషేధం చేస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. తాము మద్యనిషేధం చేస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పామని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా అని ఉంటే చూపించాలని సవాల్ చేశారు.మద్యం పాలసీ పై గందరగోళం నెలకొన్న నెలకొన్న నేపధ్యంలో మంత్రులు నాలుక మడతేస్తున్నారని, అంటున్నారు.
నిజానికి. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మద్యం రాబడినే హామీగా పెట్టి ఒకేసారి రూ.8,300 కోట్ల రుణం తెచ్చి.. మందు బాబుల్ని పాతికేళ్ల పాటు తాకట్టుపెట్టేసింది. మద్యనిషేధమనే మాటకు నిలువునా తూట్లు పొడిచింది.ప్రభుత్వ ఆదాయాన్ని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ ఆదాయాన్ని ఎస్క్రో చేసి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్న విషయంపై నాయస్థానాల్లో విచారణ జరుగుతోంది.
మరో వంక కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితితో సంబంధం లేకుండా బయట నుంచి కార్పొరేషన్ పేరుతో అప్పు తీసుకోవడంపైనా అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. అందుకే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ వాదనతో తెర ముందుకు వచ్చారు. అయితే ఇలా తప్పించుకు తిరగడం, ఇచ్చిన మాట ఇవ్వలేదని, చెప్పిన మాట చెప్పలేదని బుకాయించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త కాదు. గతంలో అప్పటి పౌరసరఫారాల శాఖ మంత్రి కొడాలి నాని, సన్న బియ్యం విషయంలో ఇలాగే, మాటతప్పారు.
సన్న బియ్యం ఇస్తామని చెప్పడమే కాదు అందుకోసంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ రెడ్డి బొమ్మతో సంచులు కూడా సిద్దం చేశారు. ఆ తర్వాత, సన్నబియ్యం ఇస్తామని మీ అమ్మ మొగుడు చెప్పాడా ?అంటూ కొడాలి నానీ తమ భాషలో దబాయించారు. ఇప్పుడు మద్యనిషేధం విషయంలో గుడివాడ కూడా అదే చెపుతున్నారు. కానీ, ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అవ్వోచ్చు కానీ, మరీ ఇంత తక్కువ అయితే కాదు. అదీ గాక ఇది సోషల్ మీడియా యుగం .. తప్పించుకు తిరగడం కుదిరే వ్యవహారం కాదు.