తెరాసకు మరో ఉద్యమ నేత గుడ్‌బై !
posted on Jul 30, 2022 @ 7:50PM
ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట సమితి (తెరాస)లో ఉద్యమ నాయకులకు, విలువ లేదు. ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో స్థానం లేదు. గౌరవం అసలే లేదు. ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు కనీసపాటి గుర్తింపు లేదు. ఉద్యమ కాలంలోనే ఆలే నరేంద్ర మొదలు ఎందరో ఉద్యమ నేతలను సాగనంపారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసేఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉద్యమ వాసనలున్న ఏ ఒక్కరినీ వదలకుండా ఉద్వాసన పలికారనే ఆరోపణలున్నాయి. ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో కేసీఆర్కు కుడి భుజంగా ఉన్న జేఏసీ చైర్మన్ కోదండరామ్ మొదలు పార్టీ నిర్మాణంలో, ఉద్యమంలో, ప్రభుత్వంలో కీలక భూమికను పోషించిన ఈటల రాజేందర్ వరకు ఎంతో మంది ఉద్యమ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఉద్యమ ద్రోహులుగా ముద్ర వేసుకున్న తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి వంటి వారికి మంత్రి వర్గంలో స్థానం కలిపించారనే విమర్శలు ఉన్నాయి. నిజానికి కేసీఆర్, 2014లోనే ఇక తెరాస ఉద్యమ పార్టీ కాదని ప్రకటించారు. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు.
అయినా, తెరాసలో ఒకరో ఇద్దరో ఉద్యమ నాయకులు మిగిలున్నారు. అలాంటి వారిలో, . తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి ఉన్న సీనియర్ నేత, కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఒకరు. ఇప్పుడు ఆయన కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు రాజయ్య యాదవ్ ప్రకటించారు. తెరాసతో 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. నిజానికి, రాజయ్య యాదవ్ తెరాసలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదు. పార్టీ నాయకత్వం ఆయన్ని మరిచే పోయింది. కానీ, ఉద్యమం చివరి అంకంలో కేసీఆర్ తో కలి నిరాహార దీక్ష చేసిన ఆరుగురు నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంతి కేసీఆర్, చావునోట్లో తలపెట్టిన సమయంలో కన్నెబోయిన యాదవ్ ఆయన వెంటే ఉన్నారు.
అయితే ఇప్పడు ఆయన తాను మోస పోయానని, కేసేఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇలా ఎన్నో ఆశలు కల్పించి చివరకు, మొండి చేయి చూపించారని అన్నారు. పదవులు ఇవ్వకపోతే ఇవ్వక పోయారు, పార్టీలో పలకరించే వారే కరువయ్యారని అవేదన వ్యక్త పరిచారు. పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు రాజయ్య.
తెరాస ఆవిర్భావ క్షణం నుంచి ఒక కార్యకర్తగా సుదీర్ఘ కాలం పనిచేశాను. కానీ పార్టీలో ఆత్మగౌరవం లేదు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. మెదక్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి..మాట తప్పారు. రాజ్యసభకు పంపుతామన్నారు, మళ్ళీ మాట తప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. దానికీ పంపించలేదు. ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఆత్మ గౌరవం లేదు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు తెరాసలో చోటు లేకుండాపోయింది. టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులకు బాధ తప్ప.. భవిష్యత్ లేదు. తలెత్తుకోవాలని బతకాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నా. నా బాటలోనే మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారు అని కన్నబోయిన రాజయ్య యాదవ్ పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమ తొలినాళ్ల నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నాయకుడిగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆరుగురు సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య కూడా ఉన్నారు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టయ్యారు. ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు ఉన్నారు. అలాంటి సీనియర్ నేత పార్టీ వదిలి పోవడం, అంటే, ఉద్యమానికి, తెరాసకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోవడమే అంటున్నారు. ఆయన పార్టీని వదిలి పోవడం ఒకెత్తు అయితే టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులకు బాధ తప్ప.. భవిష్యత్ లేదు, అంటూ చేసిన వ్యాఖ్య పార్టీలో కలకలం సృష్టిస్తోంది.ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు కానీ, బీజేపీలోకి వెళ్లే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఆయన ఏ పార్టీలోకి వెళతారు అనేది ఎలా ఉన్నా, రాజయ్య యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పడం సంక్షోభంలో చిక్కుకున్న తెరాసకు గట్టి ఎదురు దెబ్బని పార్టీ నేతలు అంటున్నారు