కేంద్రానికి తెలుగు ప్రేమ!
posted on Jul 28, 2022 @ 3:02PM
కేంద్రానికి తెలుగు రాష్ట్రాల పట్ల ప్రేమ ఎక్కువయింది. రాజకీయ ప్రేమ మాత్రం మరీ ఇబ్బందికరం అని మోదీ సర్కారే తెలియజేస్తోంది. గతంలో ఒక మాట ఇప్పుడు మరో మాట తోచిన విధంగా ఉప న్యాసాలు, ఉపోద్ఘాతాలు.. ఇవి చాలక మీదే అసమర్ధ పాలన అంటూ ప్రచారం చేయించడం. మోదీ సర్కార్‌కి ఇలాంటి చాతుర్యం పుట్టుకతో వచ్చిన గొప్ప విద్య. అందుకే టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డికి కోపం వచ్చింది.
చట్టం అన్నది దేశమంతటికీ ఒకే విధంగా అమలు కావాలి. కానీ మోదీ సర్కార్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టం అమలు చేస్తారా అని టీడీపీ నేత ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉంద న్నారు.
విభజనచట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలన్నారు. కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరంలేని చట్టసవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా? అని ప్రశ్నించారు.
ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.