మంకీపాక్స్ వైరస్ కు వ్యాక్సిన్ తయారీకి ఐసీఎమ్ఆర్ పిలుపు
posted on Jul 28, 2022 @ 11:33AM
ఒక దాని వెంట ఒకటి.. ఒకదానితో కలిసి మరొకటి అన్నట్లుగా ప్రపంచాన్ని వైరస్ లు చుట్టేస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగనే లేదు. కరోనా ప్రొటోకాల్ పాటించి తీరాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అంతలోనే ఉరుములేని పిడుగులా మరో వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆ వైరస్ పేరే మంకీ పాక్స్.
దేశ వ్యాప్తంగా 71కి పైగా దేశాలలో ఈ వ్యాధి ఇప్పటికే విస్తరించింది. నెలల వ్యవథిలోనే ప్రపంచ వ్యాప్తంగా16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ కు మంకీ పాక్స్ వైరస్ ముప్పులేదంటూ చెబుతూ వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు అదీ దేశంలో ఒక మంకీ పాక్స్ వైరస్ కేసు నిర్ధారణ అయ్యి, మరో అరడజను అనుమానిత కేసులు నమోదు అయిన తరువాత అప్రమత్తమైంది.ప్రపంచ వ్యాప్తంగా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా వ్యాధి దేశంలోకి ప్రవేశించిన తర్వాత దీన్ని నియంత్రించేందుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లుగానే, ఇప్పుడు మంకీపాక్స్ వ్యాధికి కూడా వ్యాక్సిన్ తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది.
మంకీపాక్స్ వైరస్‌ను అడ్డుకునే వ్యాక్సిన్ తయారీకి కంపెనీలను ఆహ్వానించింది. అలాగే వ్యాధిని త్వరగా గుర్తించే విట్రో డయాగ్నస్టిక్ కిట్లు కూడా తయారు చేయాలని కంపెనీలను కోరింది. మంకీపాక్స్ వైరస్ వ జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు మంకీపాక్స్ వైరస్ బారిన పడిన వ్యక్తిలో కనిపిస్తాయి.
ప్రస్తుతం అర్హత కలిగిన కంపెనీల నుంచి ఐసీఎమ్ఆర్ వ్యాక్సిన్ తయారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వారానికి కనీసం లక్ష డోసుల వ్యాక్సిన్లైనా తయారు చేయగలిగే సామర్ధ్యం ఉండాలని ఐసీఎంఆర్ అంటోంది. కోవిడ్ సందర్భంగా దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్ రూపొందించినట్లుగానే ఈ వ్యాక్సిన్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ కంపెనీలకు రాయితీ కూడా కల్పిస్తుంది. నిపుణుల సహకారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది.