ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారారా?
posted on Oct 11, 2022 @ 12:19PM
ఢిల్లీ లిక్కర్ స్కాం టీఆర్ఎస్ కాళ్ల కింద భూమిని కుదిపేస్తోందా? అంటే ఈడీ, సీబీఐల దూకుడు చూస్తుంటే ఔననే అనక తప్పడం లేదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ స్కాం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కాళ్ల కింద నేల కదిపేస్తుందని తొలుత భావించినా.. ఆ తరువాత దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలు ఈ స్కాంలో కర్త,కర్మ,క్రియ మొత్తం తెలంగాణ గడ్డేనన్న అనుమానాలకు తావిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ స్కాం లింకులన్నీ తెరాస చుట్టే తిరుగుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలో తొలి అరెస్టు జరిగిన తరువాత ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక ఈ స్కాం కు సంబంధించి అనుమానితులలో ఒకరిద్దరిని అప్రూవర్ చేసుకుని కుంభకోణం నిగ్గు తేల్చే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ ముందుకు సాగుతున్నాయి. ఈ కేసులో తెలంగాణలో అభిషేకరావును అరెస్టు చేయడం ద్వారా లిక్కర్ స్కాం మూలల్లోకి దర్యాప్తు సాగుతోందని పరిశీలకులు అంటున్నారు.
ఢిల్లీలో లిక్కర్ పాలసీ మారిస్తే.. అందులో ఉన్న స్కాం మూలాలన్నీ తెలంగాణలోనే కనిపిస్తుండటం, అందులోనూ ఈ కుంభకోణంలో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పై ఆరోపణలు రావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఇప్పటి వరకూ మూడు అరెస్టులు జరిగాయి. అరెస్టయిన ముగ్గురిలో ఒకరు టీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితుడైన బోయినపల్లి అభిషేక్ రావును ఒకరు. ఇప్పటికే ఆయనను సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా ఆయనను విచారిస్తోంది.
కానీ రాబిన్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు పలు రకాలుగా అభిషేక్ రావుతో వ్యాపారాలు చేస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను అరెస్టు చేయకపోవడమే పలు అనుమానాలకు తావిస్తోంది. అరుణ్ రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారిన కారణంగానే ఆయనను అరెస్టు చేయలేదని సీబీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి స్కాం వివరాలన్నీ తెలుసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే సీబీఐ వద్ద ఈ స్కాం తెర వెనుక పెద్దలకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక వేళ నిజంగానే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లైతే.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు, సంచలనాలు తథ్యమని, రాష్ట్ర రాజకీయాలలో కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అందుకే డిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి టీఆర్ ఎస్ పెద్దగా స్పందించడం లేదనీ, అనవసరంగా ఈ స్కాం విషయంలో విమర్శలు, ఖండనలు చేసి మరింత కెలుక్కోవడమెందుకన్నట్లుగా గుంభనంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పక్కా ఆధారాలు లభించడంతోనే ఈ కేసులో సీబీఐ, ఈడీలు దూకుడు పెంచాయనీ పరిశీలకులు అంటున్నారు.