ఆత్మగౌరవానికి... అహంకారానికి మధ్య పోటీ మునుగోడు ఉప ఎన్నిక!
posted on Oct 11, 2022 @ 11:11AM
మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మునుగోడు ఉప ఎన్నికను నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికీ, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అహంకారానికీ మధ్య జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. విశేషమేమిటంటే ఇప్పటిదాకా తెలంగాణ ఆత్మగౌరవం అన్న పదాన్ని గుత్తాధిపత్యంగా అట్టే పెట్టుకున్న తెరాస ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని వదిలేసి జాతీయ నినాదాన్ని ఎత్తుకుంది.
అయినా అలవాటులో పొరపాటు అన్నట్లుగా కేటీఆర్ మాత్రం మునుగోడు ప్రజల ఆత్మగౌరవం అన్న నినాదాన్నిఎత్తుకున్నారు. అయితే ప్రత్యర్థి అయిన కమలం పార్టీ మాత్రం ఈ సారి జాతీయ నినాదాన్ని, జాతీయ వాదాన్ని ప్రస్తావించకుండా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గతఎనిమిదేళ్లుగా తెరాస అధినేత కేసీఆర్ కాలరాసారని, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శిస్తుంటే... మంత్రి కేటీఆర్ మాత్రం మునుగోడు ఉప ఎన్నికకు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అహంకారము, బీజేపీ అధికార దాహమే కారణమని దుయ్యబడుతున్నారు.
ఎవరికీ అవసరం లేని, ఎవరికీ అక్కర్లేని ఉప ఎన్నికను బీజేపీ బలవంతంగా ప్రజల మీద రుద్దిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బలప్రదర్శన కోసమా అన్నట్లుగా బీజేపీ రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిందని ఆరోపించిన కేటీఆర్, బీజేపీకి, రాజగోపాలరెడ్డికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో జనాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఈరోజు ఉప ఎన్నికలు తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలానికి మునుగోడు ప్రజల జన బలం కి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని కేటీఆర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూపాయల ఆయన కాంట్రాక్టుల కోసమే వచ్చిన ఎన్నిక ఇదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యేగా అభివర్ణించారు. నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాల పట్టింపు లేకుండా తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారిగా రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అభివర్ణించారు.
నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరారని విమర్శించిన కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దారన్నారు. బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బిజెపికి రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు.