శాఖాహార మొసలి తనువు చాలించింది!
posted on Oct 11, 2022 @ 10:44AM
సృష్ఠిలో హేతువుకు ఇంకా అందని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటికి కారణాలేమిటన్నవిషయంలో అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అదిగో అలాంటి విశేషం, వింతే మాంసం ముట్టని మొసలి. నిజమే కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయం కోనేరులో ఉన్న మొసలి మాంసం ముట్టదు.
అది పూర్తిగా శాఖాహారి. దాని పేరు పబియా. భక్తులు కోనేరులో స్నానాలు చేస్తున్నప్పుడు వారి వద్దకు వచ్చే ఆ మొసలిని చూసి వారెవ్వరూ భయపడరు. ఎందుకంటే అది వారికి ఎలాంటి హానీ చేయదని వారికి తెలుసు కనుక. అంతే కాదు.. క్రమం తప్పకుండా ఆలయంలో పూజ సమయంతో ఆ మొసలి చెరువులోంచి బయటకు వచ్చి గుడిలో స్వామి వారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని తిరిగి చెరువులోకి వెఢుతుంది.
జీవితాంతం ఆ మొసలి ప్రసాదం తినే బతికింది. కనీసం చెరువులో ఉన్న చేపలను కూడా అది ఎన్నడూ ముట్టలేదు. అందుకే ఆ మొసలి పబియా శాఖాహార మొసలిగా గుర్తింపు పొందింది. ఎంతో భక్తితో నైవేద్య సమయానికి దేవాలయంలోకి చేరి స్వామివారి దర్శనం చేసుకుని నైవేద్యం స్వీకరించి, మరలా కోనేరులోకి పయనించే ఆ మొసలిని గుడిలో పూజారులూ, గుడికి వచ్చే భక్తులూ కూడా ఎంతో ప్రేమగా, బక్తిగా చూసుకుంటారు.
అయితే ఆ శాఖాహార మొసలి సోమవారం (అక్టోబర్ 10) తెల్లవారు జామున మరణించింది. పబియా మరణం పట్ల పూజారులూ, స్థానికులూ, భక్తులూ కూడా ఎంతో బాధపడ్డారు. ఆ మొసలికి దేవస్థానం అధికారులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.