పీక్స్ కు జగన్ ఫొటోల పిచ్చి!
posted on Oct 11, 2022 7:45AM
ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అలా తయారైంది జగన్ పరిస్థితి. అ వైసీపీ అధినేత, ఆంధ్ర సీఎం జగన్ కు ఫొటోల పిచ్చి బాగా ముదిరిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జగన్ బొమ్మలతో రెవెన్యూ, సర్వే శాఖలు భారీ ఫోటో ఎగ్జిబిషన్ కూ సిద్ధపడ్డాయి. చిత్రమేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ ఆయన ముఖ చిత్రం కనపడేట్టు చేస్తున్నారు.
పూర్వం రాజుగారికి కలొచ్చింది.. హఠాత్తుగా ప్రజలంతా తనను మర్చి పోయి పక్క రాజ్యం రాజుని కుర్చీలో కూచోబెట్టినట్టు. అంతే పొద్దున్న లేవగానే రాజధానిలో అన్ని గోడలకీ చిత్రకారులచేత తన బొమ్మ గీయించి పెట్టారట! అలా ఉంది ప్రస్తుతం జగన్ తీరు. ప్రజలు తనను మర్చిపోతారే మోనన్న భీతీ పట్టుకుందా అన్న అనుమానం కలుగుతోంది జగన్ కు పెరిగిన ఫొటోల పిచ్చి చూసి అంటున్నారు పరిశీలకులు.
అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కార్యాలయాల్లోనూ, వీలయితే అన్ని పత్రాల మీదా చిరునవ్వుతో చిద్విలాసంగా ఉన్న తన ముఖారవిందాన్ని జనానికి దర్శన భాగ్యం కలిగించాలని పట్టుదల పట్టు కుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం ముఖ్యమంత్రి క్రెడిట్‌లో వేసి ఆయన్ను శాశ్వత ఆరాధ్యుడిగా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుకోసం ఎన్నెన్నో కొత్త దారులు వెతుకుతు న్నారు. సీఎంతో పాటు తమకు కొంత చోటు ఉండాలనుకుని అధికారులు కూడా వారి ఫొటోలు సిద్ధం చేసుకుంటున్నారు. వేలకోట్ల ప్రజాధనంతో చేపడుతున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారుల ఫొటోలు ఎందుకు? రైతులకు ఇచ్చే వ్యక్తిగత పట్టాలు, రికార్డులపై వారి ముఖచిత్ర ప్రదర్శన దేనికోసం? అన్న అభ్యంతరాలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అన్నింటా తన, తన తండ్రి పేరు మారుమోగేట్లు చేయడానికి సంస్థలకు పేర్ల మార్పిడి ఉద్యమాన్ని చేపట్టా రు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ వాటిని ఇసుమంతైనా పట్టించుకోని జగన్ ఇక ఇప్పుడు ఫోటోల ఉద్యమం చేపట్టారు. కరపత్రాల మీద బొమ్మ సహజం. అది అన్ని పార్టీలవారూ ఎన్నికల సమయంలో చేసే పనే. కానీ ఈయనకు ఎన్నికల బొమ్మ స్పష్టమయినట్టుగా ఉంది. అందుకే అన్నింటా తన స్టాంప్ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే భూ రికార్డులపైనా తన ఫొటోలే. మూడేళ్ల పాలన తర్వాత ప్రజలనుంచి ఎలాంటి మంచి మాటా వినబడక పోవడంతో ప్రజలను మరింతగా తన వేపు తిప్పుకోవడానికి, చేస్తున్న విశ్వయత్నాల్లో ఈ ఫోటోల దాడి ఒకటిగా విమర్శకులు చెబుతున్నారు.
అనేకానేక సర్వేలు, గడప గడపకు వంటి కార్యక్రమాలతో సహా వచ్చే ఎన్నికల్లో కష్టమనే సూచనే చేస్తుండ టంతో, ప్రజల్లోకి ఈ విధంగా వెళ్లి ఫోటోతో విజ్ఞప్తులు చేయడం గొప్ప మార్గంగా ఆలోచించారనే అనుకోవాలి. ప్రభుత్వ ప్రకటనల్లో ఎలాగూ ముఖ్యమంత్రిగా ఆయన బొమ్మే ఉంటుంది. కానీ అనవసరమయిన చోట కూడా తన ముఖ చిత్రంతో పొద్దున్నే ఎదురుకావలని కోరుకోవడం తనను, ప్రభుత్వాన్ని కాపాడాలని వేడు కోవడంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మరి ఇప్పటికే విసిగెత్తిన ప్రజ ఈ వేడుకోలును ఎలా అంగీకరిస్తారు. రాష్ట్రంలో ఎలాంటి ప్రగతీ లేదు, ఎవరికీ పాలన పట్ల సంతృప్తి లేదు. ఈ పరిస్థితిలో అన్నిటా తన రూపే కనపడాలన్న జగన్ ఆతృత ఎబ్బెట్టుగా ఉందని జనమే అంటున్నారు.