మోడీ ‘ఛార్జ్’తో జగన్ కు తిప్పలే..?
posted on Nov 12, 2022 @ 2:15PM
ప్రధాని మోడీ ఒక పక్కన వైఎస్ జగన్ ను కొడుకు మాదిరిగా ట్రీట్ చేస్తున్నట్లు కనిపిస్తారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జగన్ కు అడిగిందే తడవు అన్నట్లు అపాయింట్ మెంట్లూ ఇచ్చేస్తుంటారు. ఏపీకి ఏమీ చేయకపోయినా ఏదో మాయమాటలు చెప్పి, వట్టి చేతులతో వెనక్కి పంపించేస్తుంటారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రధాని మోడీ అనురిస్తున్న వైఖరిలో ఇది ఒక పార్శ్వం.
తాజాగా విశాఖపట్నం పర్యటనకు వచ్చి.. జగన్ లెక్కలేంటో, తప్పిదాలేంటో వెలికి తీయాలని బీజేపీ స్థానిక నేతలను పురమాయించారు. జగన్ సర్కార్ తప్పిదాలపై ఎప్పటికప్పుడు ఛార్జ్ షీట్ వేయాలని చెప్పారు. ఆ చార్జి షీట్లను పల్లె నుంచి పట్టణం దాకా, పంచాయతీ నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. జగన్ అవినీతి, అరాచకాలను ఉపేక్షించవద్దని వారికి చెప్పారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ పాడుచేసుకుంటున్నారని, ఆ అవకాశాన్ని మనం రాజకీయంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. మీ పని మీరు చేయండి.. మీకు అధిష్టానం అండగా ఉంటుంది అని బీజేపీ కోర్ కమిటీ భేటీలో పార్టీ ఏపీ నేతలను ఆదేశించారు. అంతటితో ఆగకుండా వైసీపీ సర్కార్ పై నేరుగా యుద్ధానికి దిగాలని బీజేపీ నేతలకు సంకేతాలు ఇస్తారు.
సమాఖ్య స్ఫూర్తికి మాత్రమే తాను కట్టుబడి ఉంటానని, ఎవరిపైనా తనకు ప్రత్యేక ప్రేమ ఉండదని, ప్రభుత్వం ప్రభుత్వమే.. రాజకీయం రాజకీయమే అని బీజేపీ నేతలకు స్పష్టంగా చెబుతారు. అవినీతి విషయంలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదంటారు. అవినీతి, అరాచకాలు, భూకబ్జాలు, అప్పులు గురించి ఎప్పటికప్పుడు బయటపెట్టాలని చెబుతారు. ఏపీలో బీజేపీ బలం పెంచడంపై మరింతగా దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు హితబోధ చేస్తారు. మనకు మన పార్టీయే ముఖ్యం అని స్పష్టంగా బీజేపీ నేతలకు చెబుతారు. అంటే.. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తదితర విషయాలపై జగన్ ను ఇరకాటంలో పెట్టాలనేది ప్రధాని మోడీ మాటల్లోని అంతరార్థం అని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు.. ఏపీకి కేంద్రం చేసిన వాటి గురించి జనానికి స్పష్టంగా వివరించాలని తమ పార్టీ నేతలకు పురమాయించడం గమనార్హం.
రాజకీయాల్లో నిదానం పనికిరాదని, ఎప్పుడూ వేగంగానే ఉండాలని, సమస్య చిన్నదా? పెద్దదా? అని చూడకుండా స్థానిక సమస్యలు, పరిష్కారం కోసం గళమెత్తుతూనే ఉండాలని బీజేపీ నేతలకు నూరిపోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎండగట్టడంలో సందేహం వద్దని నిర్దేశించారు.
అంటే.. జగన్ విషయంలో బీజేపీది ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనే చందంగా మోడీ స్పష్టం చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో జగన్ అసమర్థ పాలనను ఇక ఉపేక్షించేది లేదనే సంకేతాన్ని మోడీ ఇస్తున్నారంటున్నారు. తాము తీసుకునే ఏ నిర్ణయానికైనా బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్న జగన్ విషయంలో మోడీకి ఇప్పుడెందుకు చిర్రెత్తుకొచ్చిందనే ప్రశ్న వస్తోంది. విశాఖలో తన సభను విజయవంతం చేయడానికి జగన్ అండ్ కో ఎంతగా శ్రమించినా.. మోడీలో జగన్ పట్ల ఎక్కడో ఒక మూల అసంతృప్తో లేక అసహనమో ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రధాని మోడీ ఆదేశాలతో ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై ఇక నుంచి చార్జ్ షీట్లు వేస్తే.. ఊరూరా తిరిగి ప్రజలకు రాష్ట్ర సర్కార్ తప్పిదాల గురించి ఏకరువు పెడుతుంటే.. జగన్ కు ముందు ముందు గడ్డుకాలం తప్పదేమో అంటున్నారు.