మోడీ ప్రసంగంతో జగన్ డీలా... అశలన్నీ వమ్ము? కింకర్తవ్యం?
posted on Nov 12, 2022 @ 4:32PM
జగన్ మూడు రాజధానుల పల్లవిని ప్రధాని మోడీ అసలు వినడానికే ఆసక్తి చూపలేదా? మోడీ సమక్షంలో వికేంద్రీకరణ లక్ష్యం అంటూ జగన్ తన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చినా మోడీ పట్టించుకోలేదా అంటే విశాఖ సభ వేదికగా మోడీ ప్రసంగం విన్నవారంతా ఔననే అంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడటానికి ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హీటెస్ట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశమే కారణమని చెప్పక తప్పదు. విశాఖలో మోడీ సమక్షంలో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువస్తారా? తీసుకువస్తే మోడీ ఎలా రియాక్ట్ అవుతారు? మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేతలకు గట్టిగా గళం వినిపించినప్పటికీ కేంద్రం నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదు. పైపెచ్చు రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అన్నట్లుగానే కేంద్రం వ్యవహరిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ విశాఖ సభ వేదికపై నుంచి మోడీ సమక్షంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం అందుకు మోడీ అనుమతిని కోరినట్లుగానే అంతా భావించారు. దీనికి మోడీ ఏం చెబుతారా అన్న అసక్తి అందరిలోనూ వ్యక్తమైంది. అయితే మోడీ తన ప్రసంగంలో అసలు జగన్ ప్రస్తావించిన ఏ అంశాన్నీ కూడా స్పృశించలేదు.
అసలు జగన్ ప్రసంగాన్నీపట్టించుకున్నట్లే కనిపించలేదు. జగన్ వినతులు, విజ్ణప్తులకు తన ప్రసంగంలో చోటివ్వలేదు. దీంతో జగన్ మోడీని పొగడ్తల్లో ముంచెత్తి, ఆయన ప్రాపకం కోసం పడిన తాపత్రేయమంతా బూడిదలో పోసిన పన్నీరు చందమైంది. మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్, ఇతర కేబినెట్ మంత్రులు పదే పదే ఇదే మాట చెబుతున్న నేపథ్యంలో, అందులోనూ విశాఖ పాలనా కేంద్రంగా, అక్కడి నంచే త్వరలో జగన్ పాలన సాగిస్తారనీ స్పష్టం చేస్తున్న తరుణంలో విశాఖలో ప్రధాని మోడీ పర్యటనపై జగన్ సర్కార్ పలు ఆశలు పెట్టుకుంది. అందుకే మోడీ సభ ఏర్పాట్లను జగన్ సర్కార్ స్వయంగా భుజానికెత్తుకుంది. ప్రధాని మోడీ సభకు జనసమీకరణకు చెమటోడ్చింది.
సభా ఏర్పాట్లతో మోడీని మెప్పించి, ఆయన సమక్షంలో మూడు రాజధానుల అంశం ప్రస్తావిస్తే ఆయన అభ్యంతరం చెప్పరని ఆశలు పెంచుకుంది. కేంద్రం మద్దతుతోనే మూడు రాజధానుల విధానాన్ని చేపట్టామని జనానికి చెప్పుకునే అవకాశం ఉంటుందనీ భావించింది. అయితే మోడీ తనదైన శైలిలో అసలా విషయం తన చెవిన పడలేదన్నట్లుగా వ్యవహరించడంతో జగన్ ఆశలు, వ్యూహాలు దెబ్బతిన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.