ప్రధాని ప్రసంగం విశాఖను ప్రస్తుతించడానికే పరిమితం?
posted on Nov 12, 2022 @ 2:52PM
మోడీ విశాఖ పర్యటనపై కనీవినీ ఎరుగని రీతిలో జగన్ సర్కార్ ఆర్బాటం చేసింది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శించి మరీ జన సమీకరణ చేసింది. మోడీని మెప్పించి రాష్ట్రాలనికి మేలు చేసేలా ఒకటి రెండు వరాలనైనా పొందాలని తాపత్రేయ పడింది.
అయితే మోడీ ప్రసంగం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. జగన్ ఆర్బాటం, తాపత్రేయం అంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మిగిలిపోయింది. అసలు మోడీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైన నాటి నుంచీ ఏపీ వాసుల్లో ఎన్నో ఆశలు చిగురించాయి. గత ఎనిమిదేళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలలో కొన్నిటి విషయంలోనైనా మోడీ సానుకూల ప్రకటన విశాఖ వేదిక మీద నుంచి చేస్తారని ఆశించారు. అయితే మోడీ అసలా విషయాలనే పట్టించుకోలేదు. దేశంలో విశాఖపట్నం వినా మరో అద్భుత నగరం లేదన్నట్లుగా కేవలం విశాఖను ప్రస్తుతించేసి తన ప్రసంగాన్ని ముగించేశారు. దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనలో తన ప్రసంగంలో కేవలం ఒక్క నగరం గురించి ప్రస్తావించడానికే పరిమితం కావడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది.
ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం మాత్రం రాష్ట్ర ప్రజలకు నిరాశనే మిగిల్చింది. మోడీ ప్రసంగం ఆద్యంతం చప్పగా సాగింది. హామీలు, వాగ్దానాలు లేవు. పెండింగ్ హామీల ప్రస్తావన లేదు. దక్షిణ కోస్తా రైల్వేజోన్ పై ప్రకటన లేదు. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు మోడీ ప్రకటన చేస్తారనీ, 106కోట్లతో వైర్ లెస్ కాలనీ దగ్గర జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంకు అనుమతి ఇస్తున్నట్లు విశాఖ వేదికగా చెబుతారనీ అంతా భావించారు.
అదేమీ లేదు. అఖరికి వాల్తేర్ డివిజన్ భవిష్యత్ పై క్లారిటీ సైతం ఇవ్వలేదు. యధా ప్రకారం ప్రజలను రంజింపచేయడానికి ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీకి రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇప్పుడు మరో సారి రాష్ట్ర పర్యటన రావడం మరెంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలలో విశాఖ ఒకటన్న మోడీ... ఆ నగర ప్రాశస్థ్యాన్ని వివరించడానికే పరిమితమయ్యారు. విశాఖ చరిత్రను వివరిస్తూ చెప్పింది వినండి అన్నట్లుగా వ్యవహరించారు.