ముందస్తుకే కేసీఆర్ కసరత్తు
posted on Nov 14, 2022 9:04AM
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో మళ్లీ ముందస్తు తెరమీదకు వచ్చింది. ఈ విజయంతో తెరా శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆ ఉత్సాహం అలా ఉండగానే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారా అంటే పార్టీ శ్రేణులే కాదు పరిశీలకులు కూడా ఔననే అంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల విజయం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తులు ప్రారంభించేశారనని అంటున్నారు. గతంలో కూడా ముందస్తు పార్టీకీ, కేసీఆర్ కు లబ్ధి చేకూర్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మరో సారి కేసీఆర్ అదే బాటలో పయనించేందుకు ప్రయత్నాలు ప్రారంభించేశారని చెబుతున్నారు.
మంగళవారం (నవంబర్ 15) కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్, అలాగే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్చ పార్టీ శ్రేణుల్లో మరింత ముమ్మరంగా జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడం, మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతుండడంతో ఇక అమీతుమీ తేల్చుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసేసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ సభ్యులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మంగళవారం (నవంబర్ 15)సంయుక్త సమావేశం నిర్వహించి ముందస్తుపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో మొదట తెలంగాణలో బలాన్ని నిరూపించుకుని.. ఆపై జాతీయ స్థాయిలో జెండా ఎగురవేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. ఆ ఉద్దేశమే లేకుండా ఇప్పటికప్పుడు పార్టీ లెజిస్లేచర్ భేటీ, పార్లమెంట్ సభ్యులు, కార్యవర్గ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అత్యంత కీలకమైన అంశంపై చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఇంత హఠాత్తుగా కేసీఆర్ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ కీలకమైన అంశం ముందస్తు ఎన్నికలేనని కూడా సూత్రీకరణలు చేస్తున్నారు. పరిశీలకులు విశ్లేషణలు సైతం ఆ దిశగానే ఉన్నాయి. అలాగే క్షేత్రస్థాయిలోఎప్పటికప్పుడు కేసీఆర్ పలు సర్వేలు చేయించుకుంటూ , వాటి ఫలితాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ కీలక సమావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. ఈ కీలక సమావేశం వేదికగానే తన వారసుడిగా పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పాలనా బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు,