నాడు అందరి వాడు.. నేడు ఏకాకి.. మరో చాన్స్ దక్కేనా?
posted on Nov 12, 2022 @ 2:33PM
గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకుంటే.. రానున్న ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు ఫ్యాన్ పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోవాలి... ఇది ప్రస్తుత వైసీపీ అధిరుత, సీఎం జగన్ టార్గెట్. ఆ క్రమంలో ఆయన టార్గెట్ 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గంలో భిన్నమైన వాదన వినిపిస్తోంది.
గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో.... రాజన్న రాజ్యం తీసుకు రావడం కోసం.. తన కుమారుడుకి ఒక్క చాన్స్ ఇవ్వండంటూ ఆయన తల్లివిజయమ్మ ప్రజల్లోకి వెళ్లీ మరీ విజ్జప్తి చేశారు. అలాగే జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం జగనన్న వదిలిన బాణమంటూ షర్మిల పాదయాత్రే కాదు.. బై బై బాబు అంటూ బస్సు యాత్ర సైతం చేశారు. అలాగే జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ.. టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు జోరుగా ప్రచారం సైతం నిర్వహించారు.
ఇక ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ చెందిన ఐ ప్యాక్... కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఏం చెబితే అది జగన్ తు.చ తప్పకుండా పాటించి.. పాదయాత్ర సైతం చేశారు. ఆ క్రమంలో జగన్ పార్టీ 151 సీట్లలతో బంపర్ మెజార్టీతో గెలుపొందింది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత జగన్ పెట్టుకొన్న టార్గెట్‌ను రీచ్ అవుతారా? అంటే సదరు వర్గం పెదవి విరుస్తోందని తెలుస్తోంది. అంతేకాదు అందుకు కారణాలు సైతం సదరు వర్గం సోదాహరణగా వివరిస్తుండడం మహా విశేషం.
గతంలో అంటే 2019 ఎన్నికల వేళ.. జగన్ వెంటే అందరు అంటే తల్లి, చెల్లి, పులివెందుల్లోని ఫ్యామిలీ సభ్యులు, టాలీవుడ్‌లోని పలువురు నటీనటులు ఉన్నారని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆ వర్గం గుర్తు చేస్తోంది. అలాగే గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా కోడి కత్తి దాడి కేసు అయితేనేమీ.. సీఎం వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకా దారుణ హత్య కేసు అయితేనేమీ.. నాడు జగన్ పై సానుభూతికి దోహదం చేశాయి. అయితే నేటికీ వాటి దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటే.... ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని.. ఈ సంగతి తెలుగు ప్రజలకే కాదు... ఆయా కేసులు దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సైతం తెలుసునని ఆ వర్గం పేర్కొంటోంది. అంతేకాదు.. సదరు కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో ప్రజల కళ్లని సీఎం వైయస్ జగన్‌పైనే ఉన్నాయని చెబుతోంది. అదీకాక.. ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ చెప్పిన దానికి.. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత చేస్తున్న వాటికి ఎక్కడ పొంతన అనేది లేకుండా ఉందని... సదరు వర్గం సోదాహరణగా వివరిస్తుంది.
జగన్ పరిపాలన విధానాలతో.. టాలీవుడ్‌లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా.. దాదాపుగా దూరమయ్యారు. మరోవైపు వైఎస్ ఫ్యామిలీలోని అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప.. మిగిలిన వారంతా వైయస్ జగన్‌తో సాధ్యమైనంత మేర దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరకు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా జగన్ కు దూరం జరిగారు. పక్క రాష్ట్రం తెలంగాణకు తరలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ తరఫున ప్రచారం చేసే వారు.. ఎవరు అంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వేళ.. జగన్ అండ్ కోకు తీవ్ర ఇబ్బందులు తప్పవని వైసీపీలోని ఓ వర్గంలో చర్చ వాడి వేడిగా నడుస్తోంది.
ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. జగన్ అందరినీ దూరం చేసుకుని.. ఒకే ఒక్కడుగా మిగిలిపోయారని సదరు వర్గం అభిప్రాయపడుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి ఎత్తులు, ఎత్తుగడలు వేస్తారోనని... ఇటు ప్రజలే కాదు.. అటు ఉమ్మడి కడప జిల్లా పులివెందుల్లోని ఫ్యామిలీ సైతం.. టెన్షన్‌గా ఉందని ఆ వర్గం పేర్కొంటోంది. మరి వచ్చే ఎన్నికల వేళ.. వైయస్ జగన్ వెంట ఎవరు వస్తారు.. ఎవరు నడుస్తారు అనే అంశం ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో ఓ చర్చ అయితే రచ్చ రచ్చగా సాగుతోన్నట్లు తెలుస్తోంది.