సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఆప్ కార్యకర్తల దేహశుద్ధి
posted on Nov 23, 2022 @ 10:32AM
సొంత పార్టీ ఎమ్మెల్యేకే ఆమ్ ఆద్మీపార్టీ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. ఢిల్లీ మటియాలా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ కు ఆప్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. కారణమేమిటంటే.. డిసెంబర్ 4న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో గులాబ్ సింగ్ కార్యకర్తలతో సోమవారం రాత్రి ఓ సమావేశం నిర్వహించారు.
ఆ సమవేశంలో పార్టీ టికెట్లకు సంబంధించి ఎమ్మెల్యేకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఒకింత సీరియస్ అయ్యారు. ఒకింత పరుషంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహానికి లోనైన కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. పార్టీ ఆఫీసు నుంచి ఆయన్ను తరిమి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టికెట్లను ఎమ్మెల్యే గులాబ్ సింగ్ అమ్ముకుంటున్నందునే సొంత పార్టీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే.. ఈ ఆరోపణలను గులాబ్ సింగ్ ఖండించారు. తనపై దాడి వెనుక బీజేపీ పార్టీ నేతల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.