గురివింద.. పరనింద
posted on Nov 23, 2022 @ 3:46PM
ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం సాక్షిగా.. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అంటూ.. జనసేన పార్టీ అంటే రౌడీల పార్టీ అంటూ కొత్త భాష్యం చెప్పడంపై నెటిజనులు... సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ అధినేత వైఖరి గురివింత సామెతను గుర్తుకు తెస్తోందంటూ.. సోషల్ మీడియాలో సోదాహరణలతో ఎండగడుతున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్‌లోని పంచ్ పటాకాలు.. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు.. ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై బూతుల వర్షం కురిపించేవారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.
ఇక పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు అయితే.. బూతు సరఫరాల శాఖ మంత్రిగా ముద్ర పడిపోయిందని... అలాగే నాటి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నోటి పారుదల శాఖ మంత్రిగా ఖ్యాతి గడించారని గుర్తు చేస్తున్నారు... పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, కురసాల కన్నబాబులు కూడా ప్రెస్ మీట్ పెట్టి సామిరంగా.. రంగ రంగా అంటూ ఊగిపోయే వారని నెటిజనులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. అంతదాక ఎందుకు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేశ్ తదితరులకు జగన్ మలి కేబినెట్‌లోని చోటు దక్కిందంటే.. అదంతా.. బూతుల మహిమే కదా అని ప్రశ్నిస్తున్నారు. అదీకాక.. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా మంత్రి ఆర్కే రోజా.. మిడిల్ ఫింగర్ చూపించడం పట్ల.. ఎయిర్ పోర్ట్ సిబ్బందే కాదు.. అక్కడి వారంతా ముక్కు మీద వేలేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు సైతం పేర్కొన్నారని సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ తొలి కెబినెట్‌లో అయినా.. మలి కేబినెట్‌లో అయినా.. మంత్రిగిరి దక్కిందంటే.. అదంతా.. బూతు కాల మహిమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన... ఈ మూడున్నరేళ్ల కాలంలో .. ఆయన కేబినెట్‌లోని మంత్రులు చేసిన బూతు పద ప్రయోగాలు.. సదరు ముఖ్యమంత్రి గారికి కడు కమనీయంగా.. రమణీయంగా.. వినసొంపుగా ఉన్నాయని.. నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.
అదీకాక అధికార ఫ్యాన్ పార్టీలోని నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతి, దాడులు, ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు పడుతోన్న ఇబ్బందులును ఏ మాత్రం ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని.. వాటిని ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు.. ఎప్పటి కప్పుడు ఎత్తి చూపడంతో.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తట్టుకోలేక ఓ విధమైన ఆందోళనకు గురవుతున్నారని.. ఆ ఆందోళనే నరసాపురం వేదికగా.. ముఖ్యమంత్రి మాటల్లో ప్రతిఫలించిందనీ అంటున్నారు. ఏదీ ఏమైనా ముఖ్యమంత్రి జగన్ తీరు గురివింద సామెతను గుర్తుతెస్తోందనీ, అని.. ఆయన నైజం పరనింద అని తేటతెల్లమైందని నెటిజన్లు అంటున్నారు.