ఎంసీడీ ప్రచారంలో బీజేపీ మోడీ భజన
posted on Nov 24, 2022 9:03AM
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ తో రగిలిపోతోంది. అదేంటి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలూ ఇప్పట్లో లేవు. ఇక ఎన్నికల ఫీవర్ ఏమిటంటారా? ఔను మరి ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి వచ్చే నెలలో ఎన్నికలు జరగరనున్నాయి. అందుకు సంబంధించిన ప్రచారమే ఇప్పుడు ఢిల్లీని వాయు కాలుష్యాన్ని మించిన శబ్ద కాలుష్యంలో తల్లడిల్లేలా చేస్తోంది.
కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీజేపీ దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా విజయమే లక్ష్యం అన్నట్లుగా హడావుడి చేస్తోంది. హంగామా సృష్టిస్తోంది. అవి ఏ ఎన్నికలు, అక్కడ మనకు పార్టీ నిర్మాణం ఉందా, పార్టీ నిర్మాణం ఉందా? కార్యకర్తల బలగం ఉందా ఇవేమీ పట్టవు. రాజకీయం చేసైనా, ఇతర పార్టీలలో చిచ్చు రగిల్చి అయినా కాషాయ జెండా ఎగుర వేయాలి అంతే అన్నదే కమల నాథుల లక్ష్యంగా కనిపిస్తోంది. అవి అసెంబ్లీ ఎన్నికలైనా చివరాఖరికి స్థానిక ఎన్నికలైనా ఒకటే జపం, ఒకటే మంత్రం గెలుపు.
ఇందు కోసం పార్టీ సిద్ధాంతాలను బీజేపీ ఎప్పుడో అంటే కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాడే పక్కన పెట్టేసింది. అప్పటి నుంచీ దేశ వ్యాప్తంగా అధికార విస్తరణ అన్నదే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలలో మునిగి తేలుతోంది. ఇప్పుడు ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల విషయంలోనూ బీజేపీ అదే పంథాను అనుసరిస్తోంది. అయితే ఢిల్లీలోనైనా, మరెక్కడైనా ఓటు అడగాలంటే తామేం చేశామో, ఏం చేస్తామో చెప్పుకోవాలి. కానీ ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ ఏం చేశామో చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేస్తామో చెప్పుకుంటే జనం నమ్ముతారన్న నమ్మకం లేదు. అందుకే బీజేపీకి ఎన్నికల ప్రచారంలో ఒకటే మంత్రం, ఒకటే జపం అదే మోడీ. నమో..నరేంద్రమోడీ. ఎన్నిక ఏదైనా, ఎన్నిక ఎక్కడైనా నమో జపమే గెలిపిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది.
డబుల్ ఇంజిన్ లాంటి గంభీరమైన ప్రకటనలు.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, అభివృద్ధి లేమి ఇవే ఆ పార్టీకి ఇప్పటికీ ప్రచారాంశాలు.. అంటే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఎనిమిదేళ్ల తరువాత కూడా బీజేపీకి తాను చేసిందేమిటో చెప్పుకోవడం కంటే.. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు, తప్పిదాలే ప్రచారాంశాలుగా మిగిలాయి. అందుకే మోడీయే పార్టీ ముఖచిత్రం అన్న నినాదంతో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రచారంలోకి దిగిపోయింది. మునిసిపల్ ఎన్నికలకు కూడా మోడీయేనా అన్న విపక్షాల విమర్శలను కమలనాథులు ఖాతరు చేయడం లేదు. తమ ప్రచారార్భాటంలో కాంగ్రెస్ విమర్శలు వినబడవన్నదే ఆ పార్టీ నేతల ధైర్యంగా కనిపిస్తోంది. ఢిల్లీ అభివృద్ధికి చేసిందేమైనా ఉంటే.. దానిని చూపి, వివరించి ఓట్లు అడగాలి.. కానీ అదేమీ లేనందునే మోడీ ముఖాన్ని ముందు పెట్టుకుని ప్రచార పర్వంలోకి దిగింది.
స్టార్ క్యాంపెయినర్లను ప్రచారంలోకి దించేసింది. సినిమా సహా వివిధ రంగాల సెలబ్రిటీల సేవలనూ బీజేపీ వినియోగించుకుంటోంది. విశేషమేమిటంటే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కేంద్రంలో మోడీ సర్కార్ సాధించిన విజయాలనే ఏకరవు పెడుతోంది. మునిసిపల్ ఎన్నికలలో ఢిల్లీ గురించి మాట్లాడకుండా కేంద్రం విజయాలను వల్లెవేస్తోందేమిటని హస్తిన వాసులు ఆశ్చర్యపోతున్నారు. వారి ఆశ్చర్యాలూ, అభ్యంతరాలూ పట్టని బీజేపీ శ్రేణులు మోడీయే పార్టీకి దిక్కు అన్న రేంజ్ లో ఆయనను కీర్తించడానికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని పరిమితం చేశారు. పైగా మోడీ మోడల్ ను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో తప్పేముంది అంటూ కమలనాథులు తమ ప్రచార తీరును సమర్ధించుకుంటున్నారు.
ఆశ్చర్యమేమిటంటే.. 2007 నుంచీ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమలం అధీనంలోనే ఉంది. అంటే గత 15 సంవత్సరాలుగా ఎంసీడీలో కాషాయ జెండాయే ఎగురుతోంది. అంటే బీజేపీయే అధికారంలో ఉంది. మరి దశాబ్దంనరగా అధికారంలో ఉండి కూడా ఇన్నేళ్లలో ఢిల్లీ అభివృద్ధికి తామేం చేశామో చెప్పుకోగలిగే పరిస్థితి లేక మోడీ కరిష్మా మీదే ఆధారపడిందన్న మాట. ఎంసీడీ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటి వరకూ కనీసం నలుగురు బీజేపీ ముఖ్యమంత్రులు హస్తినలో పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి
హిమంతా బిశ్వా శర్మ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి లు ఎంసీడీ ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న రోజులలో మరింత మంది జాతీయ స్థాయి నేతలు కూడా డిల్లీలో ప్రచారానికి వరుస కట్టనున్నారు. ఇందుకు పకడ్బందీ ప్రచార ప్రణాళికను రూపొందించారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో రోడ్ షఓలు, బహిరంగ సభలకు ప్రణాళికలు రూపొందించారు.
అలాగే బీజేపీ ప్రచార రథాలు సైతం ఎంసీడీ ఎన్నికలలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఆ ప్రచార రథాల నిండా మోడీ ఫటోలే. నుక్కడ్ నాటక్స్ పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున ఫ్లాష్ మాబ్స్ ను నిర్వహిస్తోంది. లోకల్ రాక్ బ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇవి యువ ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈ ప్రచార ఆర్భాటం చూసి ఢిల్లీ వాసులు విస్తుపోతున్నారు. ఎంసీడీ ఎన్నికల తరువాత మోడీ దేశ ప్రధానిగా ఉంటారా? లేక ఎంపీడీ మేయర్ గా బాధ్యతలు చేపడతారా అని ప్రశ్నిస్తున్నారు.