చంద్రబాబుతో మోడీ మరోసారి... హస్తినకేగనున్న తెలుగుదేశం అధినేత
posted on Nov 23, 2022 @ 12:12PM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో సారి హస్తిన నుంచి పిలుపు వచ్చింది. ఏదో ఆహ్వానం పంపాం అన్నట్లుగా కాకుండా.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన హస్తినకు రావాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఇంతకీ కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం ఎందుకు అందిందంటే.. భారత్ లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో చర్చించి సలహాలు తీసుకోవాలని మోడీ భావించడం వల్ల. ఇందు కోసం అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో డిసెంబర్ 5న హస్తినలో మోడీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికే చంద్రబాబుకు ఆహ్వానం అందింది.
మామూలుగా అయితే దేశంలో అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు అందినట్లుగానే చంద్రబాబుకు ఆహ్వానం అందింది అనుకోవాలి.. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబుకు ఆహ్వానం, ఆ తరువాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేకంగా ఫోన్ చేయడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా అంటే ఈ ఏడాది ఆగస్టులో మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ పై జరిగిన సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందింది.
అప్పటి నుంచీ కూడా తెలుగుదేశం, బీజేపీల మధ్య మరో సారి సఖ్యత కుదురుతుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతూనే వస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబుతో మోడీ కొద్ది సమయమే అయినా ప్రత్యేకంగా సంబాషించడం ఎనలేని రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే వచ్చే నెల 5న చంద్రబాబు హస్తిన పర్యటనలో కూడా మోడీ, బాబుల మధ్య ప్రత్యేక భేటీ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.